శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ : ప్లస్ లు మైనస్ లు ఎలా ఉన్నాయి..?
శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ
ఆర్టిస్ట్స్ : ఘట్టమనేని జై కృష్ణ, రషా టండానీ, మోహన్ బాబు, వికే నరేష్, బ్రహ్మాజీ, శ్యామ్, అజయ్ తదితరులు
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి
ప్రెజెంటర్ : అశ్వనీదత్
నిర్మాత : జెమినీ కిరణ్
దర్శకత్వం : అజయ్ భూపతి
టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే కాస్త హడావిడీ ఉంటుంది. అలాంటిదేం లేకుండా శ్రీనివాస మంగాపురం మూవీతో ఘట్టమనేని జై కృష్ణను పరిచయం చేశారు. మహేష్ బాబు లాంటి స్టార్ అన్న కొడుకుగా వచ్చినా జై కృష్ణకు ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం కాస్త విచిత్రమే అయినా.. జై కృష్ణ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అతని దర్శకత్వంలో జై కృష్ణను పరిచయం చేయాలనుకున్నారు. అంటే మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.
కథ :
పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో పేరు మోసిన రాజకీయ నాయకుడు. అతని కూతురు మంగ(రషా టండాని). థియేటర్స్ చదువుతుంటుంది. వేరే ఊరి నుంచి తిరుపతికి వచ్చిన కుర్రాడు శ్రీను(జై కృష్ణ). అతను తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. మంగ కూడా అది కేవలం స్నేహమే అనుకుంటుంది. మంగకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అవుతుంది. తర్వాత శ్రీను తన ప్రేమను చెబుతాడు. ఆమె తాళికట్టే చివరి క్షణం కోసం వరకు తను వెయిట్ చేస్తా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమె మాత్రం అతన్ని లైట్ తీసుకుంటుంది.
పెద్ది రెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి). ఆమె బల్లారిలో ఉంటుంది. మేనకోడలి పెళ్లికి వస్తుంది. అక్కడ ఫోటోస్ లో శ్రీను కూడా కనిపిస్తాడు. కట్ చేస్తే ఆమె అతని వద్దకు వెళుతుంది. తన మేన కోడలిని వదిలేయమని చెబుతుంది. కానీ శ్రీను తను తిరుపతి వచ్చిందే మంగ కోసం. మంగ లేకుండా తను బ్రతకలేను అని చెబుతాడు. మరి ఈ వ్వవహారం వెనక ఉన్న కథేంటీ..? వాసు బాబు ఎవరు..? వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కు వాసుబాబుకు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు శ్రీనుకు మంగతో ముందే పరిచయం ఉందా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఈ లోగా కొందరు విలన్స్ ఎంటర్ అవుతారు. వారి నుంచి దాటుకునే ప్రయత్నంలో ఈ ఇద్దరి సమస్యలు క్లియర్ అవుతాయి. ఇదే కథ. ఇలాంటి కథలు తెలుగు తెర ఇప్పటికి వేలల్లో చూసింది. అలాంటిదే శ్రీనివాస మంగాపురం మూవీ. బట్ ఇందులో కొత్తదనం అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఏ మాత్రం ఆకట్టుకోలేని కథనంలో కావాల్సినంత బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాదా సీదాగా సాగుతుంది. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఈ కాలాని తగ్గట్టుగా బలమైన కథనం ఉంటే బావుంటుంది. ఈ మూవీలో అదే ప్రధానమైన లోపం.
ఫస్ట్ హాఫ్ ఒకలా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కాస్త బావుంది. ఇందులోని ట్విస్ట్ కారణంగానే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అది చాలా కీలకమైనప్పుడు అది అద్భుతం అనిపించాలి. అలా లేకపోవడం ఫస్ట్ హాఫ్ తేలిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం నిజంగానే బావుంటుంది. అయితే ఇదేమీ కొత్తదేం కాదు. అయినా ఓకే అనిపిస్తుంది. ఓ రకంగా పడిపడి లేచె మనసులోని ట్విస్ట్ నే వీళ్లు మళ్లీ రిపీట్ చేశారు. ఆ మూవీ కూడా పోయింది. కానీ అంత ఇంపాక్ట్ కూడా శ్రీనివాస మంగాపురంలో లేదు. అదే పెద్ద మైనస్.
జై కృష్ణ నటుడుగా ఇంకా సానబెట్టబడాలి. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. ఎక్స్ ప్రెషన్స్ మరీ తేలిపోలేదు కానీ చాలా చోట్ల సరిగ్గా పెట్టలేకపోయాడు. జై కృష్ణను ఇలాంటి కథతో పరిచయం చేయాలనుకోవడమే పెద్ద లోపం. అయితే అతనిలోని మాస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం దురదృష్టం. రషా టండానీ నటన కూడా ఏమంత బాలేదు.
మోహన్ బాబు పాత్రను సెకండ్ హాఫ్ లో చూపించారు. అది స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది కానీ వీక్ గానే సాగింది. ఉన్నంతలో శ్యామ్ పాత్ర బావుంది. అలాగే నువ్వు నాకు నచ్చావులో సుహాసిని లాంటి పాత్రతో వాసుకి ఓకే అనిపించుకుంది. నరేష్ పాత్ర బావుంది. అద్భుతంగా నటించాడు. కానీ ఆ పాత్ర వల్ల సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేదు. బ్రహ్మాజీ కూడా ప్యాడింగ్ యాక్టర్ గానే కనిపించాడు. ఇతర పాత్రలన్నీ చాలా రొటీన్ వే.
టెక్నికల్ గా
జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అదరగొట్టాడు. వీక్ సీన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించాడు. ఈ కథలాగే పాటలు కూడా 90ల కాలం నాటివిగా కనిపించాయి. బట్ సాహిత్యం పరంగా పాటలన్నీ బావున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
దర్శకుడుగా అజయ్ భూపతి తీసుకున్న కథలో కొత్తదనం అస్సలు లేదు. కథనం పరంగా ఏదైనా మ్యాజిక్ లు చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. కానీ అతను స్లో నెరేషన్ తో బాగా ఇబ్బంది పెట్టాడు. ఓ రకంగా అజయ్ భూపతి కూడా ఇంకా 90స్ లోనే ఆగిపోయాడు. బట్ ఆ టైమ్ లో వచ్చినా ఇంత స్లో నెరేషన్ అంటే అప్పుడు కూడా వర్కవుట్ కాకపోయి ఉండేది.
ఫైనల్ గా : బ్యాడ్ డెబ్యూ బై జై కృష్ణ
రేటింగ్ : 2/5
K.Y.R






