భారతీరాజా .. వెండితెరపై గ్రామీణ భారతాన్ని ఎంతో అద్భుతంగా సెల్యులాయిడ్ చేసిన దర్శకుడు. ఒకటీ రెండు కాదు.. ఎన్నో సినిమాల్లో విలేజ్ లవ్ స్టోరీస్ తో పాటు వారి జీవన విధానాల్ని అక్కడి మట్టి వాసనలంత సహజంగా పిక్చరైజ్ చేశాడు.. ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయని వెండితెరపై ఎర్రగులాబీలు పూయించి, థ్రిల్లర్ సినిమాలతో టిక్ టిక్ టిక్ మనిపించాడు. పదహారేళ్ల వయసు నుంచే మొదలైన భారతీరాజా సంచలనం నిన్నా మొన్నటి వరకూ కొనసాగింది. తెలుగు తెరపైనా తనదైన ముద్రవేసిన భారతీరాజా కన్నుమూశారు. ఎన్నో మరపురాని చిత్రాలతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని మిగుల్చుకున్న భారతీరాజా చిత్రాల్ని ఓ సారి గుర్తు చేసుకుందాం ..
దక్షణభారత దేశ చరిత్రలో ఎంతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భారతీరాజా.. అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టింది.. పి పుల్లయ్య దగ్గర. ఆయన మన తెలుగు దర్శకుడే. తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ పుట్టన్న కనగల్, మళయాల చిత్రదర్శకుడు కృష్ణ నాయర్ వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు.. కానీ తనకంటూ ఓ శైలిని అప్పుడే ఏర్పాటు చేసుకున్నట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ సమకూర్చుకున్నాడు. అదే పదహారు వయదినిలే. పరువానికి వచ్చిన అమ్మాయిల కలలు, ఊహలు ఎలా ఉంటాయి.. ఊహలకు వాస్తవాలకు మధ్య దూరమెంత అంటూ భారతీరాజా వెండితెరపై వేసిన పెయింటింగ్ ఇండియా అంతా సంచలనం అయింది.. ఆ సినిమానే తర్వాత రాఘవేంద్రరావు తెలుగులో పదహారేళ్ల వయసుగా రీమేక్ చేశాడు.
తర్వాత తెలుగులో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో కిజక్కే పోగుమ్ రైల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూడా గ్రామీణ వాతావరణంలో సాగే ప్రేమకథే. అంచనాలను మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్నో కేంద్రాల్లో యేడాది పాటు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రాన్నే తర్వాత బాపు తెలుగులో తూర్పువెళ్లేరైలుగా రీమేక్ చేశారు.. మోహన్, జ్యోతి జంటగా నటించారు.
రెండు వరుస హిట్స్ వచ్చాయనో లేక, అతని ఎదుగుదలను ఓర్వలేకో కానీ కొందరు తమిళ చిత్ర ప్రముఖులు భారతీరాజా గ్రామీణ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు అనే ముద్రవేశాడు. దీంతో భారతీరాజా ‘‘సిగప్పుడ రోజాక్కల్’ అనే సినిమా చేశాడు. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా తెలుగులో ఎర్రగులాబీలుగా డబ్ అయింది. ఇక్కడే కాదు.. ఈ సినిమా అక్కడా బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే కమల్ తోనే థ్రిల్లర్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ తీసి విమర్శకుల నోళ్లు మూయించాడు భాగ్యరాజా.
కెమెరా యాంగిల్స్ ను కొత్తగా పరిచయం చేశాడు భారతీరాజా. అప్పటి వరకూ ఉన్న ట్రెండ్ కు పూర్తి భిన్నంగా పిక్చరైజేషన్ స్టార్ట్ చేశాడు. ఇక ఎంచుకునే కథల్లో సినిమాకు అనుగుణంగా కాకుండా ఒరిజినాలిటీకి అతి దగ్గరగా సెట్ చేసుకున్నాడు. అటే లొకేషన్స్ విషయంలోనూ అదే చేశాడు. అందుకే ఆడియన్స్ కు భారతీరాజా సినిమా పై గురి పెరిగింది.
ఇక భారతీ రాజా సృష్టించిన మరో సంచలనం టీనేజ్ లవ్ స్టోరీగా తీసిన ‘అలగై ఓవితల్లై’. కార్తీక్, రాధ జంటగా రూపొందించిన ఈసినిమా పై ఆ రోజుల్లో కొన్ని విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్మురేపింది. దాన్నే తెలుగులో సీతాకోక చిలుకగా కార్తీక్ హీరోగా ముచ్చర్ల అరుణ హీరోయిన్ గా తెరకెక్కించాడు.. ఇక్కడా ఆ చిలుక అదిరిపోయే హిట్ అందుకుంది..
ముఖ్యంగా సీతాకోక చిలుకలో అప్పటి వరకూ శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత చేత అద్భుతమైన పాత్ర చేయించాడు భారతీరాజా. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిన అవతలి వారిలోని ప్రతిభను గుర్తించడంలో భారతీరాజా స్పెషాలిటీని గుర్తు చేస్తుందా పాత్ర.. అందుకే సిల్క్ కూడా ఈ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని చూపించింది.
ఎనభైయవ దశకం అంతా భారతీరాజా సంచలన విజయాలతో నిండిపోయింది. అద్భుతమైన చిత్రాలు.. అదరిపోయే విజయాలతో భారతీ రాజా దక్షిణాది చిత్రసీమపై తిరుగులేని ముద్ర వేశాడు. వీటిలో చాలా సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.. లేదంటే డబ్ అయి, అక్కడా అంతే స్థాయిలో విజయాల్ని సాధించాయి. అయితే తొలినాళ్లలో వచ్చిన విమర్శల ప్రకారం భారతీరాజా నిజంగానే గ్రామీణ కథలతోనే ఎక్కువ విజయాలు సాధించాడు. అందులో ‘మాన్ వాసనై’ ఒకటి. ఇదే చిత్రం తెలుగులో మంగమ్మగారి మనవడు గా రీమేక్ అయింది.
భారతీరాజా సినిమాల్లో పాత్రలు అనుభవించే పెయిన్ ప్రేక్షకులూ అదే స్థాయిలో ఫీలవుతారు. అదే భారతీరాజా విజయానికి ప్రధాన కారణం. మూతల్ మరియాదై అనే ఓ మధ్యవయస్కుడి కథతో చేసిన సినిమా దేశవ్యాప్తంగా సంచలనం అయింది. నటీనటుల అద్భుత అభినయానికి తోడు, ఆ కథను భారతీరాజా నడిపించిన విధానికి ఎవరి హృదయమైనా బరువెక్కాల్సిందే. ఈ సినిమా తెలుగులో ఆత్మబంధువుగా డబ్ అయి.. సూపర్ హిట్ అయింది.
అలాగే భారతీరాజా సృష్టించిన మరో మాసివ్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఆరాధన. తెలుగులో చిరంజీవి పోషించిన పాత్రలో తమిళంలో ముందుగా సత్యరాజ్ నటించాడు.. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారతీరాజానే డైరెక్ట్ చేశాడు. ఆరాధనలోని పాటలన్నీ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే..అసలు ఇలాంటి ఓ టిపికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేయాలనే భారతీరాజా ఆలోచనకే హ్యాట్సాఫ్ చెప్పాలి..
అయితే క్లాసికల్ చిత్రాల దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు అవార్డులు సాధించిన భారతీరాజా చాలాసార్లు ఎన్నో విమర్శలు కూడా ఫేస్ చేశాడు. ముఖ్యంగా రాజాకు తెలుగువాళ్లంటే ఇష్టం ఉండదు అనేది బహిరంగ రహస్యం. అలాగే తమిళనాడు అంతా వ్యతిరేకించే అప్పటి ఉగ్రవాద గ్రూప్ అధిపతి ప్రభాకరన్ ను కలిసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్నాళ్ల క్రితం తన స్వీయదర్శకత్వంలోనే రూపొందించిన ‘‘అన్నకోడి’’ అనే సినిమాలో తెలుగువారిపై తన విద్వేషాన్ని వెల్లగక్కాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది..
భారతీరాజా దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. చాలాసార్లు ముక్కుసూటి తనంతో మరికొన్ని సార్లు దుడుకుతనంతో విమర్శలపాలయ్యాడు. ఓ రకంగా భారతీరాజాకు ఉన్న ఇమేజ్ కు కాస్త క్లీన్ సర్టిఫికెట్ కూడా ఉండి ఉంటే ఆయన్ని గౌరవించే వారి సంఖ్య ఇంకా చాలా పెరిగి ఉండేదని సన్నిహితులే చెబుతారు.. అలాగే ఇప్పుడు తెలుగు, తమిళ సీమల్లో టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న కాజల్ ను తెరకు పరిచయం చేసింది ఆయనే. అయితే కొన్ని రోజుల క్రితం కాజల్ కు డిసిప్లిన్ లేదని.. ఆమెను అనవసరంగా తను ఇంటర్ డ్యూస్ చేశానని చెప్పి సంచలనం సృష్టించాడు..
విమర్శలు, వివాదాలూ పక్కనబెడితే, ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది మన తెలుగువాడైన పి పుల్లయ్య దగ్గరే. అలాగే మనం కమెడియన్ అనుకుంటున్న సుధాకర్ ను తమిళనాట స్టార్ హీరోను చేసింది కూడా భారతీరాజానే. అయినా తెలుగువారంటే ఆయనకెందుకు ఇష్టం ఉండదో కానీ, ఓ దర్శకుడిగా, సృజనాత్మకత ఉన్నవాడిగా భాషతో, వివాదాలతో సంబంధం లేకుండా భారతీరాజా ప్రతి ఒక్కడి హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు మళ్లీ వస్తాడనేది కూడా అనుమానమే అని ఎంతో మంది సినీ పెద్దలు ఇప్పటికీ అంటూ ఉంటారు.. ఏదేమైనా భారతీరాజాకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేయాలని కోరుకుందాం..






