ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకునేవారం. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. వస్తోన్న మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి. ఎవరికి వారు మేం గొప్ప తీశాం అని భావిస్తున్నారు తప్ప.. ఆడియన్స్ యాంగిల్ అవి ఎలా ఉండబోతున్నాయి అని ఎవరూ అనుకోవడం లేదు. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయాయి. ఎంతలా అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు విడుదలైన సినిమాలు మామూలుగా 60 -70 వరకు ఉన్నాయి. మరి వీటిలో సక్సెస్ రేట్ ఎంత అంటే స్పష్టంగా చెబితే మూడో నాలుగు సినిమాలు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలైన మృత్యుంజయ్ నుంచి మొదలైతే.. మే లాస్ట్ వీక్ లో విడుదలైన మరీచిక వరకు కూడా ఏ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మధ్యలో మార్చిలో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. బట్ వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైందీ మూవీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు అనే పేరున్నా.. అది ఆడియన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ ఫైడ్ చేయలేదు అనేది నిజం. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఈ మూవీతో ఇక కష్టం అనిపించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. అంత దారుణంగా పోయిందీ మూవీ.
ఇక ఏప్రిల్ మాత్రం గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదలైన రాకాస, బైకర్ మూవీస్ బాక్సాఫీస్ కు కళ తెచ్చాయి. ఈ రెండూ కమర్షియల్ గా మంచి విజయాలు సాధించాయి. రాకాస కాస్త ఎక్కువ వసూళ్లు సాధించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. హారర్ కామెడీ అన్నారు కానీ హారర్ అసలేమాత్రం లేదు. మాగ్జిమం కామెడీతో లాగించారు. బట్ ఈ మూవీలో కూడా బలమైన కథ అంటూ లేదు.
బైకర్ ఇండియాలోనే ఫస్ట్ బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన మూవీగా చెప్పారు. ఆ మేరకు ఆకట్టుకుంది. శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించారు. యాంగ్రీ మేన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. అతని నటనే ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. హై ఇంటెన్షల్ డ్రామాగా రూపొందిన బైకర్ అనుకున్న దానికంటే కాస్త తక్కువ విజయం సాధించింది. బట్ హిట్ గా నిలిచింది.
తర్వాత విడుదలైన డెకాయిట్ కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. అడివి శేష్ గత చిత్రాలతో పోలిస్తే డెకాయిట్ పూర్తిగా తేలిపోయింది. కథ, కథనాల్లో అసలు పస లేదు. అయినా ఈ మూవీ హిట్ అయిందంటే అదో మిరాకిల్ అనే చెప్పాలి. ఇక ఆపై విడుదలైన చిత్రాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు చిత్రాలు మాత్రమే ఏప్రిల్ వరకు సరిపెట్టుకున్నాయి. ఇక మే నెలలో విడుదలైన చిత్రాలు కూడా తేలిపోయాయి. వీటిలో గోదారి గట్టుపైన మూవీ మాత్రం కమర్షియల్ గా విజయం సాధించింది అంటూ సక్సెస్ మీట్ పెట్టారు. బట్ ఈ మూవీలో కథ, కథనం మాత్రం కంప్లీట్ గా అవుట్ డేటెగ్ గా నిలిచాయి. ఏ మాత్రం కొత్తదనం లేని సినిమాగా దీన్ని ఆడియన్స్ తేల్చారు.
మొత్తంగా ఈ వేసవిలో విడుదలైన సినిమాలన్నీ దారుణంగా పోయాయి. ఓ రకంగా ఐపిఎల్ వల్ల మూవీస్ ఇబ్బంది పడ్డాయి అన్నా కూడా కొన్ని అయినా కంటెంట్ పరంగా ఆకట్టుకోవాలి కదా. బట్ అందులో పూర్తిగా తేలిపోయాయి. ఎంచుకున్న కథల్లో నవ్యత లేదు.. కథనంలో కొత్తదనం ఉండదు. హీరోయిజం పేరుతో సాగించిన ప్రహసనాలే ఈ చిత్రాలన్నీ తేలిపోవడానికి ప్రధాన కారణం. ఇకపై తెలుగు సినిమా జాగ్రత్త పడాల్సిందే. ఇలాంటి కథలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణమైన పరాజయాలు రావడం మాత్రం ఖాయం