మాస్ మహరాజ్ రవితేజ.. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే అతను ఎంచుకున్న కథల్లో అప్పుడు సత్తా చాటాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అప్డేట్ కావాలి. బట్ ఈ విషయంలో రవితేజ చాలాకాలం పాటు అప్డేట్ కాలేకపోయాడు. అదే పనిగా మూవీస్ అన్నీ పోతున్నా అతను మారలేదు. ఓ దశలో అభిమానులు కూడా ఇవేం మూవీస్ రా బాబూ అని తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్తదనం అనే పదానికి చాలా దూరంగా అతని కథలు కనిపించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుల దండయాత్ర మొదలైంది. ఒకదాన్ని మించి ఒకటిగా డిజాస్టర్ అయ్యాయి. ఓ దశాబ్దం పాటు కొనసాగిన ఈ ఫ్లాపుల పర్వం అతని కెరీర్ నే ప్రశ్నార్థకంలో పడేసింది. బాగా ఆలస్యం అయినా ఆత్మ పరిశీలనలో పడిపోయాడు. అందులో భాగంగానే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ చేశాడు. ఈ కథలో కొత్తదనం లేదు. బట్ అతను చేయడం వల్ల కొత్తగా అనిపించింది. దీనికి తోడు తన ఇమేజ్ కు దూరంగా ఈ మూవీ చేశాడు. ఈ యేడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా విజయాన్ని సాధించింది. ఈ టైమ్ లో ఎవ్వరూ ఊహించని కథకు కమిట్ అయ్యాడు రవితేజ.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఇరుముడి’అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతను కథల విషయంలో ఓ మెట్టు ఎక్కుతున్నాడు అనిపించేలాఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అది చాలామందిని ఆకట్టుకుంది. తాజాగా ఇదే మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. ఈ పాట ఇరుముడి చుట్టూ సాగే గీతం. అయ్యప్ప మాల వేసుకుని, ఇరుముడి కట్టుకుని దీక్షను విరమించే సందర్భంలో వచ్చే పాట. ఈ పాటలో ఎక్కడా రవితేజ అతి కనిపించలేదు. చాలా సాధారణంగా సాగింది. పాట, సాహిత్యం రెండూ బావున్నాయి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మూవీలో చాలా కీలకంగా ఓ పాప కనిపిస్తోంది. ఈ పాటలో తను వేసిన డ్యాన్స్ లు చాలా బావున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ ఇది. ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.
ఏదేమైనా రవితేజ కాలానికి తగ్గట్టుగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అదే పనిగా మాస్ రాజా అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కు అంతగా వర్కవుట్ కాదు అనేది అర్థమైనట్టుంది. మరి ఇకనైనా బలమైన కథలను ఎంచుకుంటూ తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. అప్పుడప్పుడు మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీసుకువస్తే తన మళ్లీ రేంజ్ మారుతుంది.