సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

సద్గురు ₹1 కోటి విరాళం

సద్గురు టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించాడు. ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.
నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.
“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.
అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, ‘ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే’ అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”
ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.
ఈ విపత్తుకు “దైవిక కారణాలు” లేదా “మార్మిక కోణాలు” ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. ‘ఇదంతా దేవుడి లీల’ అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”
ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు.

Continue reading
నేపాల్ వరదలపై సద్గురు ఆవేదన.. 80 మంది సభ్యుల ఆచూకీపై ఆందోళన

నేపాల్ వరదలపై సద్గురు రియాక్షన్

నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించగా.. వందలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ విపత్తుపై ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గా వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న Isha Foundationకు చెందిన ఒక గ్రూప్ సభ్యుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సద్గురు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. బాధిత ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

నేపాల్‌లో అసలేం జరిగింది?

ఆగస్టు 26 ఉదయం నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వరదలు, మట్టి ప్రవాహాలు విరుచుకుపడ్డాయి. రాసువా జిల్లాలోని ల్హెండే ఖోలా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం భోటే కోషి నది వైపు దూసుకెళ్లింది.

దీంతో రాసువాగఢి, టిమురే, స్యాఫ్రూబెసి తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలకు కూడా రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం పెద్ద అడ్డంకిగా మారింది.

హిమనదం కూలిపోవడమే కారణమా?

ఈ ఘటనకు సంబంధించి తొలుత భూకంపం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా శాస్త్రీయ విశ్లేషణ ప్రకారం హిమాలయ ప్రాంతంలో హిమనదంలోని ఒక భాగం కూలిపోవడం, దాని కారణంగా భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి దూసుకురావడం.. ఆ తర్వాత నదికి తాత్కాలిక అడ్డంకి ఏర్పడి అది తెగిపోవడం వల్ల భారీ వరద ఉద్ధృతి ఏర్పడినట్లు తెలుస్తోంది.

US Geological Survey కూడా నమోదైన సీస్మిక్ సిగ్నల్ భూకంపం వల్ల కాకుండా ఈ భారీ ల్యాండ్‌స్లైడ్‌ వల్ల ఏర్పడిందని తరువాత స్పష్టం చేసింది.

సద్గురు ఏం చెప్పారు?

ఈ విషాదంపై సద్గురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బృందం నుంచి కొంతమంది బాధిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. రోడ్లు మూసుకుపోవడం, ఫోన్ లైన్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో అక్కడికి చేరుకోలేకపోయామని ఆయన తెలిపారు.

అక్కడి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెబుతూ.. తాను, తన బృందంలోని కొంతమంది సభ్యులు బాధిత ప్రాంతానికి వెళ్లి ఏమైనా సహాయం చేయగలమా అన్నదానిపై ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సంబంధిత రాయబార కార్యాలయాల ద్వారా అనుమతులు కోరుతున్నట్లు వెల్లడించారు.

Isha Foundation గ్రూప్‌లో 80 మంది

సద్గురు వెల్లడించిన వివరాల ప్రకారం S3 గ్రూప్‌లో మొత్తం 80 మంది ఉన్నారు. ఇందులో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, స్పెయిన్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.

ఈ గ్రూప్‌లో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నట్లు సద్గురు తెలిపారు. వీరితో పాటు సమీపంలోని హోటళ్లలో ముగ్గురు వాలంటీర్లు, ఒక డాక్టర్ కూడా ఉన్నారని ఆయన వివరించారు.

అయితే తాజా వార్తా నివేదికల్లో 77 మంది Isha Foundation తీర్థయాత్రికులు గల్లంతైనట్లు పేర్కొంటున్నారు. సద్గురు చెప్పిన 80 మంది మొత్తం సంఖ్యలో వాలంటీర్లు, డాక్టర్ కూడా ఉండటంతో ఈ రెండు సంఖ్యల మధ్య తేడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇమ్మిగ్రేషన్ భవనం దగ్గరే చివరి మెసేజ్?

సద్గురు చెప్పిన వివరాల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే.

గ్రూప్ లీడర్ ఈశాంగ్ ప్రవీణ్ ఉదయం 9.05 గంటలకు ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి చేరుకున్నామని మెసేజ్ పంపినట్లు సద్గురు తెలిపారు. ఆ తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ విపత్తు సంభవించిందని చెప్పారు.

తాము ఇమ్మిగ్రేషన్ కోసం వారం క్రితం ఉపయోగించిన భవనం కూడా వరద ధాటికి కొట్టుకుపోయిందని సద్గురు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని పట్టణంలో కొంత భాగం కూడా వరదలో కొట్టుకుపోయిందని ఆయన వివరించారు.

అందుకే ఆ గ్రూప్ సభ్యుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది.

కుటుంబాలకు సమాచారం ఇచ్చిన సద్గురు బృందం

కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో గల్లంతైన వారి కుటుంబాలకు సమాచారం అందించడం కూడా కష్టంగా మారింది.

అయితే సద్గురు బృందం ఈ విషయంలో సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించినట్లు తెలిపారు. భారత్, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ బాధిత ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబాలకు కూడా పరిస్థితిని తెలియజేస్తూ సందేశాలు పంపినట్లు సద్గురు తెలిపారు.

1500 మందికి పైగా గల్లంతయ్యారా?

సద్గురు తన ప్రకటనలో ఈ విపత్తు తీవ్రతను బట్టి మొత్తం గల్లంతైన వారి సంఖ్య 1,500కు మించి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇది అధికారికంగా నిర్ధారించిన సంఖ్య కాదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు, రోడ్లు దెబ్బతినడంతో సహాయక బృందాలకు పూర్తి సమాచారం అందడం కష్టంగా ఉంది.

తాజా అంతర్జాతీయ నివేదికల్లో నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో గల్లంతైన వారి సంఖ్య వందల నుంచి 1,000కు పైగా మారుతూ కనిపిస్తోంది. అందువల్ల తుది అధికారిక లెక్కలు వచ్చే వరకు సంఖ్యల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సద్గురు స్వయంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నం

ఈ పరిస్థితుల్లో సద్గురు స్వయంగా బాధిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

కానీ రోడ్లు మూసుకుపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోవడంతో నేరుగా అక్కడికి చేరడం సాధ్యం కాలేదు. దీంతో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకుని ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహాయక చర్యలు చేపట్టే అవకాశం లభిస్తే బాధితులకు సాధ్యమైనంత సహాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

మరోవైపు నేపాల్ అధికారులు భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. సైన్యం, పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల ద్వారా గల్లంతైన వారిని గుర్తించడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే కొండ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసం కావడం.. భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడం.. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇంకా వీడని ఉత్కంఠ

ప్రస్తుతం ఈ విపత్తులో చిక్కుకున్న వారి సంఖ్యపై పూర్తి స్పష్టత లేదు. ముఖ్యంగా Isha Foundationకు చెందిన 77 మంది తీర్థయాత్రికుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

సద్గురు కూడా ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురై.. పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు.

ఇప్పుడు అందరి దృష్టి రెస్క్యూ ఆపరేషన్‌పై, గల్లంతైన వారి ఆచూకీపై, అధికారికంగా వెలువడే తదుపరి సమాచారం కోసం ఉంది.

ప్రాణాలతో బయటపడిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా తీసుకురావాలని.. గల్లంతైన వారి కుటుంబాలకు త్వరగా సమాచారం అందాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Continue reading
జుకర్‌బర్గ్‌కు ఉద్యోగుల షాక్.. AIతో మనుషులను భర్తీ చేసే Meta ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది?

Meta AI Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచంలోని టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్న వేళ.. Meta మాత్రం ఒక అడుగు ముందుకేసి తన సంస్థలోనే మనుషుల స్థానంలో AI ఏజెంట్లను విస్తృతంగా ఉపయోగించాలనుకుంది. ఈ లక్ష్యంతో Project OT (Organization Transformation) పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళిక వేసింది.

కానీ అనుకున్నదంతా సజావుగా జరగలేదు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత, AI పనితీరుపై వచ్చిన అనుమానాలు, టెక్నికల్ సమస్యలు, సెక్యూరిటీ ఘటనలు.. ఇలా వరుస పరిణామాలతో చివరకు భారీగా చేయాలనుకున్న రెండో విడత ఉద్యోగుల తొలగింపును Meta నిలిపివేసింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు జుకర్‌బర్గ్ ఏం ప్లాన్ చేశారు?

Reuters దర్యాప్తు ప్రకారం 2026 జనవరిలో Meta CEO మార్క్ జుకర్‌బర్గ్, కంపెనీ ఉన్నతాధికారులతో కలిసి హవాయిలో జరిగిన లీడర్‌షిప్ రిట్రీట్‌లో సంస్థ భవిష్యత్‌పై కీలక ప్రణాళికలు రూపొందించారు.

Project OT పేరుతో రూపొందిన ఈ ప్రణాళికలో Metaను మరింతగా AI-native companyగా మార్చాలన్నది ప్రధాన లక్ష్యం.

అంటే.. ఇప్పటివరకు ఉద్యోగులు చేసే అనేక రోజువారీ పనులను AI ఏజెంట్లు నిర్వహించాలి. వాటిని పర్యవేక్షించడానికి తక్కువ సంఖ్యలో, అత్యంత నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో చిన్న టీమ్‌లు ఉండాలి.

కొన్ని టీమ్‌ల పరిమాణాన్ని గరిష్ఠంగా 60% వరకు తగ్గించే అవకాశాలను కూడా పరిశీలించినట్లు Reuters తెలిపింది. అయితే ఇది Meta మొత్తం ఉద్యోగుల్లో 60% మందిని తొలగించే ప్రణాళిక కాదు.

ఉద్యోగుల్లో ఎందుకు ఆగ్రహం వచ్చింది?

AI వల్ల తమ పని సులభం అవుతుందని ఉద్యోగులు భావించినా.. అదే AI తమ ఉద్యోగాలకే ముప్పుగా మారుతుందనే భయం మొదలైంది.

ఇదే సమయంలో Metaలో ఉద్యోగుల కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి కీబోర్డ్, మౌస్ వినియోగానికి సంబంధించిన ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం మరింత వివాదానికి కారణమైంది.

తాము చేసే పనిని ట్రాక్ చేసి.. ఆ డేటాతో తమ స్థానంలో పనిచేసే AI వ్యవస్థలను తయారు చేస్తున్నారా? అనే ఆందోళన ఉద్యోగుల్లో పెరిగింది.

కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లో ఈ అంశంపై ఉద్యోగులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు Reuters నివేదించింది. కొందరు సీనియర్ అధికారులతోనే నేరుగా వాదనలకు దిగినట్లు కూడా కథనం పేర్కొంది.

ఉద్యోగుల మోరల్ కూడా భారీగా పడిపోయింది

Project OT కారణంగా ఉద్యోగుల్లో అసంతృప్తి ఎంతగా పెరిగిందో కంపెనీ అంతర్గత సర్వేలోనూ కనిపించింది.

Reuters ఆధారంగా వచ్చిన వివరాల ప్రకారం Metaలో ఉద్యోగుల సెంటిమెంట్ 74% నుంచి 55%కి పడిపోయింది.

అంటే AI మార్పు కేవలం ఉద్యోగాలపైనే కాదు.. సంస్థలోని ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపింది.

అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది.. AI కూడా అనుకున్నంతగా పనిచేయలేదు!

ఒకవైపు ఉద్యోగులు వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు జుకర్‌బర్గ్ భారీగా నమ్ముకున్న AI వ్యవస్థల పనితీరుపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి.

Metaలో AI సహాయంతో అంతర్గత కోడ్ మార్పుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 220% పెరిగింది. పైకి చూస్తే ఇది అద్భుతమైన ఉత్పాదకతలా కనిపిస్తుంది.

కానీ అసలు ప్రశ్న అక్కడే వచ్చింది.

వినియోగదారులకు చేరిన కొత్త లేదా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు మాత్రం 36% మాత్రమే పెరిగాయి.

అంటే AIతో కోడ్ ఎక్కువగా తయారవుతున్నప్పటికీ.. ఆ కోడ్ అంతా వినియోగదారులకు ఉపయోగపడే ఫీచర్లుగా మారడం లేదన్నమాట.

సమస్యలు కూడా పెరిగాయి

AI ఏజెంట్ల వినియోగం పెరిగిన సమయంలో కొన్ని అంతర్గత వ్యవస్థల్లో టెక్నికల్, సెక్యూరిటీ సమస్యలు కూడా పెరిగినట్లు Reuters ఆధారంగా వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.

ప్రధాన టెక్నికల్, సెక్యూరిటీ ఘటనలు 40% పెరిగినట్లు అంతర్గత సమాచారం సూచించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు వెచ్చించిన సమయం కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇక్కడే Metaకి అసలు సమస్య అర్థమైంది.

AI ఎక్కువ పని చేస్తుందా? లేక ఎక్కువ పని సృష్టిస్తుందా?

అనే ప్రశ్న సంస్థలోనే తలెత్తింది.

Meta AI సపోర్ట్ బాట్‌తో హ్యాకర్ల దెబ్బ

ఇదే సమయంలో Meta ఎదుర్కొన్న మరో AI సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది.

Meta AI ఆధారిత సపోర్ట్ చాట్‌బాట్‌లోని లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు కొన్ని Instagram ఖాతాలను స్వాధీనం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రభావిత ఖాతాల్లో Obama-era White House Instagram account, Sephora ఖాతా, అమెరికా Space Forceకు చెందిన ఓ ఉన్నతాధికారికి సంబంధించిన ఖాతా వంటి హై-ప్రొఫైల్ అకౌంట్లు ఉన్నట్లు పలు సైబర్‌సెక్యూరిటీ నివేదికలు వెల్లడించాయి. Meta ఆ లోపాన్ని గుర్తించి పరిష్కరించినట్లు తెలిపింది.

AIని ఉపయోగించి మరింత ఆటోమేటెడ్, స్మార్ట్ సిస్టమ్స్ నిర్మించాలనుకుంటున్న సమయంలోనే.. AI ఆధారిత సపోర్ట్ వ్యవస్థలో భద్రతా లోపం బయటపడటం Metaకి ఇబ్బందికరంగా మారింది.

మే 19 రాత్రి కీలక నిర్ణయం

ఇప్పటికే మేలో మొదటి విడత ఉద్యోగుల తొలగింపులకు Meta సిద్ధమైంది.

మే 20న సుమారు 10% ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కంపెనీ అమలు చేసింది. అదే సమయంలో వేలాది మంది ఉద్యోగులను AIకి సంబంధించిన కొత్త కార్యక్రమాల్లోకి మార్చే చర్యలు కూడా చేపట్టింది.

కానీ అసలు సంచలనం మే 19 రాత్రే జరిగింది.

నవంబర్‌లో చేపట్టాలని భావించిన రెండో విడత భారీ పునర్వ్యవస్థీకరణను జుకర్‌బర్గ్ చివరి నిమిషంలో నిలిపివేశారు.

అంటే.. మొదటి దశలో ఉద్యోగుల కోతలు జరిగినా, మరింత పెద్ద స్థాయిలో చేయాలనుకున్న తదుపరి దశ మాత్రం ముందుకు సాగలేదు.

మరి ఉద్యోగులే జుకర్‌బర్గ్‌ను వెనక్కి తగ్గించారా?

ఇక్కడే ఈ కథలో ఆసక్తికరమైన అంశం ఉంది.

ఉద్యోగుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఒక కారణం. మరోవైపు AI నుంచి ఆశించిన ఉత్పాదకత కనిపించకపోవడం, టెక్నికల్ మరియు సెక్యూరిటీ సమస్యలు పెరగడం కూడా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు Reuters దర్యాప్తు సూచిస్తోంది.

అందుకే “ఉద్యోగుల తిరుగుబాటుతోనే జుకర్‌బర్గ్ మొత్తం AI ప్లాన్‌ను రద్దు చేశారు” అని చెప్పడం కంటే.. ఉద్యోగుల వ్యతిరేకతతో పాటు AI పనితీరు, సంస్థాగత సమస్యలు కూడా Project OTలో మార్పులకు కారణమయ్యాయని చెప్పడం సరైనది.

AIపై మాత్రం Meta వెనక్కి తగ్గడం లేదు

ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి.

Project OTలోని కొన్ని అత్యంత దూకుడైన ఉద్యోగుల కోతల ప్రణాళికలు వెనక్కి వెళ్లినప్పటికీ.. Meta AIపై పెట్టుబడులను మాత్రం ఆపడం లేదు.

2026లో Meta తన AI మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ 2026 క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంచనాను $130 బిలియన్ నుంచి $145 బిలియన్ పరిధిలో ఉంచింది.

అంటే కథ “AIని వదిలేసిన Meta” గురించి కాదు.

కథ అసలు “AIతో మనుషులను ఎంతవరకు భర్తీ చేయగలం?” అనే ప్రశ్నకు Meta ఎదుర్కొన్న కఠినమైన వాస్తవాల గురించి.

చివరికి ఏం తేలింది?

టెక్ కంపెనీలు AIని ఉద్యోగుల స్థానంలో పెట్టడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి. కానీ AI ద్వారా కోడ్ రాయించడం ఒక విషయం.. ఆ కోడ్‌ను సురక్షితంగా, సమర్థవంతంగా, వినియోగదారులకు ఉపయోగపడే ప్రొడక్ట్‌గా మార్చడం మరో విషయం.

Meta అనుభవం కూడా ఇదే విషయాన్ని చూపిస్తోంది.

220% కోడ్ మార్పులు పెరిగినా.. ఫీచర్లు 36% మాత్రమే పెరిగాయి.

AI ఏజెంట్లు వేగాన్ని పెంచగలిగినా.. వాటిని పర్యవేక్షించే మనుషుల అవసరం పూర్తిగా పోయే పరిస్థితి ఇంకా రాలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

అందుకే జుకర్‌బర్గ్‌కు ఇది పూర్తిగా AIపై ఓటమి అని చెప్పలేం. అదే సమయంలో AI అన్నీ చేస్తుంది, మనుషుల అవసరం ఉండదు అనే ఆలోచనకు మాత్రం ఇది ఒక పెద్ద హెచ్చరిక.

మనుషులను తీసేసి AIని పెట్టాలని చూసిన Meta.. చివరికి AIతో కలిసి మనుషులు ఎలా పనిచేయాలి అనే దిశగా తిరిగి ఆలోచించాల్సి వచ్చింది.

Continue reading
శ్రీదేవి.. దేవతలూ అసూయపడే అందగత్తెగా వెలిగిన నటి

శ్రీదేవి జయంతి స్పెషల్ గా ఈ కవిత
శ్రీదేవి..
ఏ దేవి వరమో..
దేవతలూ అసూయపడే అందం పొందింది..
ఓ సిరిమల్లె పువ్వులా..
జామురాతిరి జాబిలమ్మలా..
పాలచుక్కలు.. తేనెబొట్టులు కలిపి రంగరించిన అతిలోక సుందరి.. శ్రీదేవి
బాలనటిగా భలేగా చేసి
పదేహేనేళ్లకే పదహారేళ్ల వయసుతో వచ్చి
తెల్లారబోతోంటే కల్లోకి చేరి
తెల్లార్లూ నిద్రల్లేకుడా చేసింది..
వయోభేదం లేకుండా
నయాజొరం తెప్పించింది
చెల్లెలికాపురంలో అన్నకు
అక్కకోసం దేవతలా మారి
బడిపంతులు తాతతో
ఆకుచాటు తడిసిన పిందెలా ఆడిపాడి
వయసుమళ్లిన హీరోలతో
ప్రేమాభిషేకం చేయించుకుని
ఆకాలం ప్రేక్షకుల అనురాగ దేవతలా
కలకాలం తరగని అభిమానం సంపాదించి
కమలాసన్ కే కన్నుకుట్టేలా
వసంతకోకిలలా మైమరపించింది
‘థండర్ థైస్’ తో బాలీవుడ్ లో వండర్ చేసి
ఓవర్ నైట్ ఓ రేంజ్ కు వెళ్లిపోయి..
లిమిటెడ్ హీరోతో అన్ లిమిటెడ్ రొమాన్స్ పండించి
మిస్టర్ ఇండియాస్ నూ మెస్మరైజ్ చేసి
ఇండియన్ వెండితెరపై వెలుగులే వెలవెలబోయే
తళుకులు చూపించింది..
ఆఖరుకి
నాన్న అకాల మరణం, అమ్మ అజాగ్రత్తతో కుంగిపోయినా
అతిలోకసుందరిలా క్షణక్షణం గుర్తొచ్చే నటన చూపి
అకస్మాత్ పెళ్లికి తలవంచింది
అందని ఆనందాల కోసం వేదనలు పడి
వేదికలపై వేయివాట్స్ బల్బ్ ల నవ్వులు పంచి
వేదనలో వేయి చీకట్ల అగాథాల్ని చూసి
ఒక జీవితంతో వంద పాఠాలు నేర్చుకుని
కన్నవారి అందలం చూడకుండానే కన్నుమూసింది
అప్రతిహతంగా వెలిగినట్లు నటించి
ఆఖరికి ఆఖరుపోరాటంలో ఓటమికి తలవంచి
ఊపిరిని అర్పించి
ఓ వెన్నెల రేయిలో కోట్లమంది మనసుల్లో చీకట్లు నింపింది
కానీ..
నీ లోకానికి వెళ్లిపోయి…
నువ్వేం చేశావో తెలుసా దేవీ..
నీ జీవితానికి నువ్వే శాడ్ ఎండింగ్ వేసుకున్నావ్
నీ జీవితం గురించి ఇంటర్వెల్ వరకే తెలిసిన మాకు
నీ ఎండింగ్ కు కారణం ఎప్పటికీ తెలియని,
తెలుసుకోలేని విధంగా చేసి
నీ లోకానికి వెళ్లిపోయావ్..
ఇప్పుడీ లోకంలో అతిలోక సుందరి అంటే
ఎవర్ని చూపించాలో చెప్పకుండానే
అమరపురికి వెళ్లిపోయావ్..
కానీ మళ్లీ ఓసారి నీ ఉంగరం పారేసుకోవూ..
కనీసం ఈ సారైనా
నీ కథ ఆనందంగా ఉండేలా చేసుకునేందుకైనా
మరోసారి నీ ఉంగరం పారేసుకోవూ..
పారేసుకుంటావు కదూ…
– బాబురావు..
9959977389

Continue reading
స్నేహానికన్న మిన్న లేదురా.. Friendship Day Special | స్నేహం గొప్పదనం తెలిపే ప్రత్యేక కథనం

స్నేహానికన్న మిన్న లేదురా

స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అన్నాడో కవి. నిజమే.. ఎన్ని బంధాలున్నా.. ఎందరు బంధువులున్నా.. ఎవ్వరికీ సాటి రానిది స్నేహం. ఏదో ఒక దశలో స్నేహాన్ని అనుభవించని మనిషీ, స్నేహాన్ని వర్ణించని కవీ ఉండరేమో.. ఎవరి అనుభవాలకు వారుగా తమ స్పందనలను తెలియజేస్తారు. అందుకే ఈ లోకంలో డబ్బుల్లేనోడు కాదు, స్నేహితులు లేనోడే అసలైన పేదోడు అంటారు.. ఇవాళ స్నేహితుల దినోత్సవం.
ఆపదలో ఉంటే అడక్కుండానే సాయం చేస్తుంది స్నేహం.. చేసిన సాయానికి ప్రతిఫలాన్ని ఎన్నడూ కోరదు. స్నేహముంటే చాలూ.. అది పంచే మాధుర్యం ఉంటే చాలు అనుకునే స్నేహితులుంటే ఆ జన్మధన్యం అనకుండా ఉండగలమా.
ప్రేమైనా.. పెళ్లైనా.. మరే బంధమైనా వెదుక్కుంటేనే వస్తుంది. కానీ స్నేహం అలా కాదు.. అది మన కంటే ముందే పుట్టి ఉంటుంది.. ఓ రెండు ఆత్మలు కలసి బ్రహ్మదేవుణ్ని ఓ వరం అడిగాయట. రూపురేఖలు వేరైనా ఒకే ఊపిరిగా ఉండే బంధాన్ని సృష్టించమని.. అప్పుడు వచ్చిన ఆ సృష్టే ఈ స్నేహం.. అంటే కాదనేదెవరు..
పసికందులుగా పుట్టిన తర్వాత.. ఊహ తెలిసే టైమ్ కే మనకు స్నేహితులెవరో తెలిసిపోతుంది. ముందుగా అమ్మానాన్నా స్నేహితులుగా ఉంటారు. కానీ ఆ బంధాన్ని కూడా మరిపించేలా మరో స్నేహం మనకు తోడయ్యేది మనకు ఓ వయసు వచ్చిన తర్వాతే.. అప్పుడు ఏర్పడ్డ స్నేహం ఎన్ని అవాంతారాలొచ్చినా.. ఆగదు.. ఎంత వయసుకు వచ్చినా వాడిపోదు.. అసలా బంధాన్ని వర్ణించాలంటే అనుభవం తప్ప మాటలు చాలవు..

స్నేహం… ప్రతిఫలం ఆశించని బంధం

మనలో చాలామంది స్నేహాలు పాఠశాల స్థాయి నుంచే పెరుగుతాయి. ఆ వయసులోనే మనకు స్నేహితుడూ.. అతని విలువా తెలుస్తుంటాయి.. అలా మొదలైన స్నేహం ఎంత ఎదిగినా విడిపోదు.. సరికదా.. మరింత బలపడుతుంది. ఆటపాటలు, చదువుల నుంచి కెరీర్ వరకూ కలిసే నడుస్తుంది. అప్పటి వరకూ మనతో ఉన్న నేస్తాలు తాత్కాలికంగా విడిపోతున్నా.. ఎప్పటికీ ఫేర్ వెల్ లేని ఏకైక బంధం స్నేహం మాత్రమే.
స్నేహానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు.. కానీ కాలేజ్ డేస్ లో స్నేహాన్ని అనుభవించడం జీవితంలో ఒక స్వచ్ఛమైన బహుమతి.. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోని స్నేహితులు కాలేజ్ డేస్ లో మనకెప్పుడూ ఉంటారు. కాకపోతే అలాంటి స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలంటే మనసు, మనమూ నిజాయితీగా ఉండాలంతే.. అప్పుడు ఆ స్నేహితుడే కాదు.. అతనితో గడిపే కాలం కూడా మన నేస్తమవుతుంది.
లోకమే మనంగా గడిపిన స్నేహాలు ఎక్కడో ఓ చోట తాత్కాలికంగా విడిపోవాల్సి వస్తుంది. అది తాత్కాలికమే అయినా.. అలాంటప్పుడు, అప్పటి వరకూ వారు పంచుకున్న కబుర్లు.. చేసిన అల్లరి పనులు గుర్తుకు వచ్చిన ఆ క్షణం కన్నీటి నివాళిగా మారుతుంది. అయినా ఆ అల్లరిని ఈ కన్నీటితో కలిపి పంచుకుంటారు. అలాంటి ఈ స్నేహ బంధం ఎంత మధురమో కదా..

దూరం పెరుగుతుంది… కానీ స్నేహం కాదు

ఎన్ని తరాలైనా అంతరాలు లేని బంధం స్నేహం.. అలాంటి బంధానికి ఎవరైనా అడ్డు తగిలినా.. ఒక్కసారి మనసులు కలిసిన స్నేహాలకు ఆస్తులు అంతస్తులు మేటర్ కానే కావు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఆ స్నేహితులు కలకాలం నిలిచే ఉంటారు.. దానికి రాజు పేద భేదాలుండవు. వర్ణ, వర్గ తారతమ్యాలు ఉండవు.
నిజానికి మన పురాణాల్లో అత్యంత గొప్ప స్నేహంగా దుర్యోధనుడు, కర్ణుడు అని చెబుతారు. అలాంటి నేపథ్యంలో ఉన్న వాళ్లెవరైనా ఇప్పటికీ అలాంటి స్నేహాన్ని నిలుపుకుంటారు. నేస్తం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు ఎన్నడూ వెనకాడరు. ఇక్కడ స్నేహితుడు.. అతని మంచి తప్ప మరొకటి కనిపించదు..
జీవితంలో ఏ బంధానికైనా విడిపోవడాలుంటాయోమో కానీ స్నేహానికి ఉండవు.. కారణం.. అది అన్ని బంధాలకు అతీతమైనది.. హృదయ స్పందనలంత స్వచ్ఛమైనది. అందులో తేడాలు వచ్చి ఆ స్పందన ఆగిపోతే పోయేవి ప్రాణాలే తప్ప స్నేహం కాదు.. అందుకే చిన్నారి స్నేహాలెన్ని తాత్కాలికంగా విడిపోయినా.. ఆ చిరునామాను కథగా రాసుకోమంటారు..

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని ఆ కవి ఏ అనుభవంతో రాశాడో కానీ.. ఆ అనుభవంలో తడిసిపోని మనిషి ఉండడు.. ఒకవేళ ఉన్నా అలాంటి వారంతా స్వచ్ఛమైన మనసుతో అచ్చమైన స్నేహితుణ్ని వెదుక్కోవాలి..

Continue reading
ప్రకృతి పరిరక్షణ ఎందుకు ముఖ్యం?

ప్రకృతి – మనిషి శాశ్వత బంధం

తొలిపొద్దు పొడవగానే ముఖాన్ని తాకే చల్లని సూర్యకిరణం, పచ్చని పంట పొలాల అందం, గలగల పారే వాగులు, ఆకాశంలో తేలియాడే నీలి మబ్బులు, తెల్లవారుజామున గ్రామ వీధుల్లో వెలిగే చలిమంటలు… ఇవన్నీ కలిపితే మన కళ్ల ముందు నిలిచేది ఒక అందమైన పల్లెటూరు.

పల్లెటూరు అంటే కేవలం ఇళ్లు, పొలాలు మాత్రమే కాదు. అది ప్రకృతి ఒడిలో పెరిగిన జీవన విధానం. అక్కడ ప్రతి ఉదయం ప్రకృతితో మొదలై, ప్రతి సాయంత్రం ప్రకృతిలోనే ముగుస్తుంది. ప్రకృతి లేకుంటే పల్లెటూరు ఉండదు. పట్టణం ఉండదు. చివరికి జీవరాశే ఉండదు.


పంచభూతాలే జీవనానికి ప్రాణాధారం

గాలి, నీరు, నేల, నిప్పు, నింగి… ఈ పంచభూతాలే ప్రతి జీవికి ఆధారం.

మనిషి శ్వాసించే గాలి, తాగే నీరు, సాగు చేసే నేల, జీవించడానికి అవసరమైన వాతావరణం అన్నీ ప్రకృతే అందిస్తుంది. అందుకే ప్రకృతిని కాపాడటం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మన ఉనికిని కాపాడుకునే కర్తవ్యం.


మానవ నాగరికతకు ప్రకృతే పునాది

చరిత్రను పరిశీలిస్తే, తొలి నాగరికతలన్నీ నదీతీరాల్లోనే అభివృద్ధి చెందాయి.

అడవులు ఆహారాన్ని ఇచ్చాయి. నదులు జీవనాన్ని ఇచ్చాయి. నేల వ్యవసాయాన్ని నేర్పింది. ప్రకృతి ఇచ్చిన వనరులను వినియోగించుకుంటూ, వాటిని కాపాడుతూ మనిషి వేల సంవత్సరాలు జీవించాడు.

అభివృద్ధి, ప్రకృతి రెండూ ఒకే దారిలో ప్రయాణించాయి.


గ్లోబలైజేషన్ తర్వాత ప్రకృతిపై పెరిగిన ఒత్తిడి

గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని దగ్గర చేసింది. సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేసింది. కొత్త ఉద్యోగాలు, మెరుగైన రవాణా, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు తీసుకొచ్చింది.

అయితే మరోవైపు, అధిక ఉత్పత్తి, అధిక వినియోగం, పరిశ్రమల విస్తరణ, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వేగం పెరిగింది. వ్యవసాయ విస్తరణ, గనుల తవ్వకాలు, రహదారులు, పట్టణీకరణ వంటి అంశాలు అటవీ విధ్వంసానికి ప్రధాన కారణాలుగా మారాయి.


అడవులు తగ్గితే ఏమవుతుంది?

అడవులు కేవలం చెట్ల సమూహం కాదు.

అవి భూమికి ఊపిరితిత్తులు.

అవి కార్బన్‌ను గ్రహించి వాతావరణ మార్పులను తగ్గిస్తాయి. ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో గణనీయమైన భాగాన్ని అడవులు శోషిస్తాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచం సుమారు 10 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోతోంది. అడవుల నరికివేత ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో సుమారు 11 శాతం వరకు కారణమవుతోంది.

అడవులు తగ్గితే…

  • వర్షపాతం తగ్గుతుంది.
  • భూగర్భ జలాలు క్షీణిస్తాయి.
  • జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.
  • వాతావరణ సమతుల్యత కోల్పోతుంది.
  • వేడి తీవ్రత పెరుగుతుంది.

అభివృద్ధి అవసరం… కానీ సమతుల్యత మరింత అవసరం

అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు.

ఆసుపత్రులు కావాలి.

రోడ్లు కావాలి.

పరిశ్రమలు కావాలి.

సాంకేతికత అవసరం.

కానీ ఈ అభివృద్ధి ప్రకృతిని నాశనం చేసేలా ఉండకూడదు.

“Sustainable Development” అంటే భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా అభివృద్ధిని కొనసాగించడం. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు ఇదే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి.


దురాశే అతిపెద్ద శత్రువు

ఈ భూమిపై ప్రతి జీవి తన అవసరానికి మాత్రమే తీసుకుంటుంది.

కానీ మనిషి మాత్రం అవసరానికి మించి సంపాదించాలనే దురాశతో ప్రకృతిని దోచుకుంటున్నాడు.

  • చెరువులు ఆక్రమిస్తున్నాడు.
  • నదులను కలుషితం చేస్తున్నాడు.
  • అడవులను నరికేస్తున్నాడు.
  • కొండలను తవ్వేస్తున్నాడు.

దీని ఫలితంగా అనేక జంతు, పక్షి, వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి.


సాంకేతికత – వరమా? శాపమా?

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసింది.

కానీ అదే సమయంలో…

  • ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
  • పారిశ్రామిక కాలుష్యం
  • గ్రీన్ హౌస్ వాయువులు
  • అధిక శక్తి వినియోగం

వంటి కొత్త సవాళ్లను కూడా తీసుకొచ్చింది.

సమస్య టెక్నాలజీలో లేదు.

దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు ప్రశ్న.


ప్రకృతిని కాపాడేందుకు మనం చేయగల చిన్న చిన్న పనులు

ప్రతి వ్యక్తి చేయగల పనులు:

  • ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్క నాటడం.
  • ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం.
  • నీటిని వృథా చేయకుండా వినియోగించడం.
  • స్థానిక చెరువులు, వాగులు పరిశుభ్రంగా ఉంచడం.
  • అడవుల సంరక్షణకు సహకరించడం.
  • పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంచడం.
  • అవసరమైనంత మాత్రమే వినియోగించే అలవాటు పెంచుకోవడం.

ముగింపు

ప్రకృతి మనకు ఏమీ అడగదు.

కానీ మనకు కావాల్సిన ప్రతిదీ ఇస్తుంది.

ఈ భూమిపై మనిషి యజమాని కాదు. కేవలం ఒక బాధ్యతాయుతమైన సంరక్షకుడు మాత్రమే.

గ్లోబలైజేషన్, అభివృద్ధి, సాంకేతికత మన జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ అవి ప్రకృతిని బలి తీసుకునే స్థాయికి చేరకూడదు. అభివృద్ధి మరియు ప్రకృతి పరిరక్షణ పరస్పర విరుద్ధాలు కావు; సరైన విధానాలతో రెండూ కలిసి నడవగలవు. ప్రపంచవ్యాప్తంగా అటవీ సంరక్షణ, పునర్వనీకరణ, సుస్థిర అభివృద్ధిపై పెరుగుతున్న దృష్టి అదే విషయాన్ని సూచిస్తోంది.

ఈరోజు మనం ఒక చెట్టును కాపాడితే…

రేపు అదే చెట్టు మన తరాలకు జీవాన్ని ఇస్తుంది.

ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతిని పరిరక్షిద్దాం. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందిద్దాం.

Continue reading
మళయాలంలో టాప్ లేపిన తెలుగు సంగీత దర్శకుడు విద్యా సాగర్

24శాఖలు ఎంతో కష్టపడితేనే ఓ సినిమా రెడీ అవుతుంది. కానీ ఆ సినిమా హిట్ అయితేనే ఆ శాఖల్లోని అందరికీ గుర్తింపు వస్తుంది. ఇండ్యువిడువల్ గా ఎవరెంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినా.. సినిమా హిట్ కాకపోతే గుర్తింపు రాదు.. అలా తను ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినా సినిమాలు హిట్ కాకపోవడంతో ఇతర భాషా సినిమాల్లోకి వలస వెళ్లి అక్కడ నుంచి జాతీయ అవార్డ్ సాధించిన ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. తెలుగు వాడైనా మళయాలీల మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విద్యాసాగర్ సంగీత ప్రస్థానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

విద్యాసాగర్ పుట్టింది అమలాపురంలో. కుటుంబం అంతా సంగీతకారులే కావడంతో తన రక్తంలోనూ సంగీతం ఉందంటాడు విద్యాసాగర్. అయితే అతని చిన్నతనంలోనే తండ్రి సినిమా రంగానికి వెళ్లారు. విద్యాసాగర్ కు తండ్రే తొలి గురువు కూడా. తర్వాత వేరే మాస్టర్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆయనకు మరో ఫ్రెండ్ దొరికాడు.. అతనే ఎఆర్ రెహ్మాన్. ఇద్దరూ కలిసి ఆ గురువు వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.

ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విద్యా సాగర్

11యేళ్ల వయసులో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుని ఇండియాకు వచ్చారు. తర్వాత తండ్రి పరిచయాలతో కెవి మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయారాజ, రాజన్ – నాగేంద్ర వంటి నాటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ టైమ్ లో ఎస్పీ కోదండపాణి వద్ద వచ్చిన ఓ చిన్న అవకాశం అతన్ని 17యేళ్లపాటు తెరవెనుకే ఉండిపోయేలా చేసింది. అన్నేళ్ల పాటు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కు దాదాపు 600 సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశారట.
అలా ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లోనే చిలిపి కృష్ణుడు అనే సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. నిజానికి ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. ఆయనకు వీలుకాకపోవడంతో తను చేశాడు. అయినా నేను కూడా ఇంత బాగా చేయలేకపోయేవాణ్నేమో అన్నారట బర్మన్.. ఆ స్థాయి ప్రతిభ ఉన్నా చిన్న అదృష్టం లేక చాలా యేళ్ల పాటు తెరవెనుకే ఉండిపోవాల్సి వచ్చింది.
సంగీత దర్శకుడిగా నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్న విద్యాసాగర్ కు ఆ తరుణం వచ్చింది. 1989లో సంగీత దర్శకుడిగా పూ మనమ్ అనే ఓ తమిళ చిత్రానికి ఛాన్స్ వచ్చింది. దానికోసం ఎంతో కష్టపడ్డా ఫలితం రాలేదు. సినిమా పోయింది. కానీ తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి, తేనెటీగ, ఆమె చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇవి హిట్ అయినా మళ్లీ విద్యాసాగర్ కు అదృష్టం కలిసి రాలేదు.
నిజానికి విద్యాసాగర్ కెరీర్ ప్రారంభం నుంచీ ఇలాగే జరిగింది. ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిన సందర్భాలుంటే, వచ్చిన ఛాన్సుల్లో చాలా వరకూ తన వర్క్ బావున్నా సినిమా బాగాలేకపోవడం వల్లో, లేక హిట్ అయిన సినిమాల్లో ఇంకేదో బావుందనో తనకు బ్రేక్ వచ్చేది కాదు. ఆ టైమ్ లోనే మరో ఛాన్స్ తెలుగులోనే వచ్చింది. సురేష్, మీనా నటించిన అల్లరి పిల్ల సినిమా అది. ఇందులో తూరుపు సిందూరపు అనే సూపర్ హిట్ అయింది.

ముగ్గురు మొనగాళ్లుకు సంగీతం అందించిన విద్యా సాగర్

అల్లరి పిల్ల యావరేజ్ గా ఆడినా.. పరిశ్రమలో అందరూ ఎదురు చూసే కాంబినేషన్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది విద్యాసాగర్ కు. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఓ రోజు రాఘవేంద్రరావే విద్యాసాగర్ తో చిరంజీవి సినిమాకు పనిచేస్తావా అని అడిగారట. మరి కాదంటాడా.. వెంటనే ఒప్పేసుకుని అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు.. ఆ సినిమా ముగ్గురు మొనగాళ్లు.
బ్యాడ్ లక్ వెంటాడుతున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదంటే ఇదే. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో మళ్లీ మరో బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు వెయిట్ చేశాక, అది కూడా టాలీవుడ్ ను వదిలేశాకే విద్యాసాగర్ కు అదృష్టం మొదలైంది.
యాక్షన్ సినిమా చేసిన ఓ సంగీత దర్శకుడికి పెద్ద క్రేజ్ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యాసాగర్ విషయంలో ఇదే జరిగింది. అప్పటికే తెలుగు, తమిళంలో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ తనే దర్శకుడిగా మారి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జై హింద్. ఈ సినిమాకు సంగీతాన్నందించిన విద్యాసాగర్ తొలి బ్లాక్ బస్టర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో చాలా ఫాస్ట్ గా దూసుకపోయాడు.

మళయాలంలో విద్యా సాగర్ కు తిరుగులేని బ్రేక్

తమిళంలో వచ్చిన క్రేజ్ తో అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో విద్యాసాగర్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 1998వ సంవత్సరంలో మళయాల చిత్రం ‘అళగియ రావణన్’ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్. హీరో సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆమూవీతో పాటు మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తో పాటు మొత్తం తనొక్కడికే 12 అవార్డులు వచ్చాయి.
మళయాలంలో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో వరుసగా అక్కడే అన్ని అవకాశాలూ వచ్చాయి. అలా 2000,2002 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడు. తర్వాత తమిళంలోనూ 2001లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అయితే తెలుగులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలన్న కల మాత్రం తీరలేదు..
ఇక విద్యాసాగర్ ను సౌత్ లో తిరుగులేని సంగీత దర్శకుణ్ని చేసింది చంద్రముఖి. రారా సరసకు రారా అంటూ తను కంపోజ్ చేసిన పాట రజినికాంత్ కే ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పాటలన్నీ అలరించాయి.. ఈ సినిమా తర్వాత తనకు హిట్ ఫ్లాపులకు సంబంధించిన పట్టింపులు పోయాయంటాడు విద్యాసాగర్.
జాతీయ అవార్డ్.. ఈ టైటిల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అందుకే నేషనల్ అవార్డ్ అందుకున్నవారు ఏ భాష వారైనా ఆసక్తిగా చూస్తాం. కానీ మనోడే అయినా మనవాళ్లు పట్టించుకోని విద్యాసాగర్ కు చివరికి తెలుగు సినిమాతోనే నేషనల్ అవార్డ్ రావడం విశేషం. చాలాయేళ్లుగా కె విశ్వనాథ్ తో పనిచేయాలనుకున్న తన కల నెరవేరడంతో విద్యాసాగర్ కు బోనస్ జాతీయ అవార్డ్ ను అందించిన ఆ సినిమా స్వరాభిషేకం.

కే.విశ్వనాథ్ మూవీస్ విద్యా సాగర్ కు మళ్లీ

కె విశ్వనాథ్ రూపొందించిన సప్తపది, శంకరాభరణం చిత్రాలకు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ శిష్యుడిగా ఈ మూవీస్ కు రీరికార్డింగ్ చేసిన తను తర్వాత విశ్వనాథ్ సినిమాకే పనిచేసి జాతీయ అవార్డ్ అందుకోవడం ఆనందం అంటాడు విద్యాసాగర్. అలాగే తన మరో ఫేవరెట్ డైరెక్టర్ బాపుతోనూ పనిచేసిన సంతృప్తిని మిగుల్చుకున్నాడు. బాపు తీసిన సుందరకాండకు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగరే.
విద్యాసాగర్ సంగీతంలో ఇటు శాస్త్రీయం, అటు వెస్ట్రన్ రెండూ ఉంటాయి. సందర్భాన్ని ఈ రెండూ మిక్స్ చేసి అందించిన పాటలూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాసాగర్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు మన దగ్గర కాకుండా మరో భాషలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అతని దురదృష్టమే తప్ప మరేమీ కాదు.. మరి ఇకనైనా విద్యాసాగర్ కు ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు రావాలని, అవన్నీ హిట్ కావాలని కోరుకుందాం..

Continue reading
ఎదురుచూపులు మాని ఎదుర్కోవడం నేర్చుకో..?

అక్కడెవరో నిద్రపోయారని నానా యాగీ చేస్తున్నావ్
నువ్వేదో మెలకువలో ఉన్నట్టు..
ఎవడో వచ్చి ప్రశ్నించడం లేదని నానా ప్రశ్నలూ గుప్పిస్తున్నావు
వినడాన్ని మించి ఇంకేం చేయగలవు.. ?
ఎవడో వస్తాడని .. ఎన్నాళ్లైనా కానీ
ఎదురుచూస్తూనే ఉంటావు
నీ సమస్యపై ఎవడో ప్రశ్నిస్తే కానీ
పౌరుషం గుర్తుకురాని గులామ్ గిరీగానివా నువ్వు
హామీలిస్తే చాలు.. హాయిగా ఉంటాననే భ్రమల్లో తేలిపోతావు
అమలు ఎలా అని ఆలోచించవెందుకు
బతుకంటేనే పోరాటం..
అది ఆపేసి
వాడి ప్రశ్నల కోసం
వాడి బాసుల కటాక్షం కోసం కాచుకుంటావెందుకు..?
కళ్లుమూసుకుని ప్రపంచాన్ని చూస్తున్నవాడివి
నీకు కన్నెర్రజేసే హక్కుందంటావా..?
ఆలోచించుకో.. నువ్వేం చేయాలో..
ఆలోచించుకో .. నువ్వేం చేయగలవో..
ఆలోచనలు పంచుకో .. నువ్వేం చేయగలననుకుంటున్నావో ..
గొర్రెలమందకు నేర్పాల్సింది
తలవంచుకు వెళ్లిపోవడం కాదు..
తలఎత్తుకుని ఆలోచించడం
ఆ మందకు చూపాల్సింది
గరికపచ్చ మైదానాలను కాదు
కీకారణ్యం కౄరమృగాలను
ఎందుకంటే గొర్రెలూ తిరగబడతాయ్..
నేడో రేపో ఎల్లుండో..
ఆలస్యమైనా ఫర్వాలేదు..
అదనుచూసి వేట మొదలుపెట్టాలి
అందుకే ఎదురుచూపులు మాని
ఎదుర్కోవడం నేర్చుకో..?

Continue reading