బిజెపికి షాక్
తాజాగా వెలువడిన మూడు బైపోల్స్ ఫలితాలు చూస్తుంటే.. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న పెద్దలకు, ఇక్కడ కూటమి సర్కార్ నడుపుతున్నోళ్లకు చెమటలు పట్టడం ఖాయం. ఇవి ఎవరో సాధారణ సీట్లు కావు, బీజేపీకి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోట్లు. అలాంటి చోట్లోనే ఓటర్లు దిమ్మతిరిగేలా రిజల్ట్స్ ఇస్తే, కమలనాథులతో పాటు కూటమి భాగస్వాములకు కూడా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా.
గుజరాత్ గుండెల్లో రైల్లు
బీహార్‌లోని బంకీపూర్‌లో బీజేపీ ఓటు షేర్ ఏకంగా ఇరవై మూడు శాతం గాలిలో కలిసిపోయింది. ఇక మోదీ, షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని మంజల్పూర్లో సీటు గెలిచినా పండగ చేసుకునే సీన్ లేదు. గతంలో లక్షకు పైగా ఉన్న భారీ మెజారిటీ ఈసారి కేవలం ముప్పై వేలకు పడిపోయింది, ఓటు షేర్ కూడా పాతిక శాతం హాంఫట్ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని దాతియాలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకొని రూట్ క్లియర్ చేసుకుంది.
పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా కూటమి ప్రభుత్వాల నడుపుతున్నప్పుడు ఈ రేంజ్ వ్యతిరేకత వస్తే.. పక్కన ఉన్న మిత్రపక్షాలు సైలెంట్‌గా ఎందుకు కంగారు పడుతున్నాయో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. “మా మాస్ పవర్ ముందు ఎవరైనా సరే” అనుకున్న అహంకారానికి నేటి ఓటర్లు ఈ ఫలితాలతో గట్టిగానే సమాధానం చెప్పారు. కంచుకోటల గోడలు ఎంత బలమైనా, ప్రజా వ్యతిరేకత పునాదుల్ని కదిలిస్తుందనడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం, మిత్రులకు సైతం నిద్రలేకుండా కావడం ఖాయం.






