Gaaradi Telugu news logo

సింగీతం శ్రీనివాసరావు.. ఆయనది డిఫరెంట్ స్కూల్ అని ఏ దర్శకుడినైనా అనాలంటే ముందు మొదలుపెట్టాల్సింది ఈయన పేరుతోనే. అంతలా వైవిధ్యమైన చిత్రాలతో వెండితె తెరపై పుష్పక విమానంలో విహరించి.. భూత భవిష్యత్ కాలాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడాయన. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి ప్రవేశించి.. ఆ స్వర్ణయుగపు వారసత్వాన్నే చివరి సినిమా వరకూ పాటించిన దర్శకుడు సింగీతం. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా, నిరంతర శోధకుడిగా.. ఉత్సాహభరితంగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఓ రకంగా ఈ స్థాయి దర్శకులు ఈ దేశంలోనే ఎవరూ ఉండరేమో. 94యేళ్ల వయసులో కూడా సింగ్ గీతం అనే సినిమా తీసి ఆకట్టుకున్నారాయన. మరణించే క్షణం ముందు కూడా సినిమానే తలచుకుని ఉంటారేమో.

ఎప్పుడూ తన ఏజ్ కు ముందుగా ఊహించి సినిమాలు తీయడం ఆయన స్టైల్. అలాంటి నిత్య యవ్వనుడు మరణించారంటే నమ్మాల్సిందే. ఓ సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించిన అరుదైన దర్శకుడుగా కూడా సింగీతం పేరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ప్రయోగాత్మక సినిమాలతో భారీ కమర్షియల్ విజయాలు అందుకున్న దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు పేరు ముందుంటుంది. ఏ ప్రయోగం చేసినా ఆయన బలం కథే. కథాబలంతోనే అత్యంత ప్రతిభావంతమైన దర్శకుడుగా నాలుగు దశాబ్ధాలకు పైగా రాణించారు. కమర్షియల్ సినిమాలు వెల్లువలా ఉన్న టైమ్ లో భైరవద్వీపం వంటి జానపదం చేశారు. ఆదిత్య 369తో ఒక అద్భుత ఊహాలోకాన్ని సృష్టించారు. కమల్ హాసన్ తో ఎన్నో ఎక్స్ పర్మెంట్స్ చేశాడు. అన్నీ కమర్షియల్ గానూ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఎలా చూసినా.. ఇండియన్ సినిమా హిస్టరీలో సింగీతం శ్రీనివాసరావు పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.
సింగతం శ్రీనివాసరావు పుట్టింది నెల్లూరు జిల్లాలో. చదువుపూర్తయిన తర్వాత టీచర్ ఉద్యోగంలో చేరారు. అప్పుడే నాటకాలపై అభిమానం మొదలైంది. తనే స్వయంగా కొన్ని నాటకాలు రచించి దర్శకత్వం వహించి ప్రదర్శనలు ఇచ్చేవారు. నాటకాలతో మొదలైన వ్యామోహం వెండితెర వరకూ వెళ్లింది. తర్వాత కెవి రెడ్డి వద్ద శిష్యుడుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన వద్ద మాయాబజార్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు సింగీతం.
పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయాలనుకున్నారు. అప్పుడాయన సింగీతం శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకున్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది. తర్వాత రోజుల్లో సింగీతం కన్నడ పరిశ్రమకు వెళ్లడానికి ఈ పరిచయాలే దోహదం చేశాయి..
ఇక దర్శకుడిగా సింగీతం చేసిన తొలి సినిమా ‘నీతి నిజాయితీ’.సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన ‘జమీందారుగారి అమ్మాయి’ ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిచడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ సూపర్ హిట్ గా నిలిచింది.
సింగీతం శ్రీనివాసరావు అనగానే ఈ తరానికే కాదు.. ఆ తరానికీ గుర్తొచ్చే పేరు ప్రయోగాలకు ఆద్యుడు అని. నిజంగానే ఆయన మండే ఒక ఎక్స్ పర్మెంటల్ లాబొరేటరీ. అతను అలా విస్త్రుతంగా ఆలోచించడానికి కారణం.. దాదాపు తనలానే ఆలోచించే మహానటుడు కమల్ హాసన్ పరిచయం కావడమే. ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ఎన్నో ప్రయోగాత్మక, విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.
తొలి రోజుల్లో సింగీతం వేసిన అడుగుల్లో నిజాయితీ ఉన్నా, ఎందుకనో అవి తడబడ్డాయి… మాతృభాష తెలుగులో ఎన్ని చిత్రాలు రూపొందించినా, ఆయనకు అంతగా పేరు రాలేదు… కన్నడ, తమిళ చిత్రాలతోనే సింగీతం అంటే ఏమిటో లోకానికి తెలిసింది… అలాగే మూకీని దాటుకుని వచ్చిన దశాబ్ధాల తర్వాత పాటలు, మాటలతోనే సినిమాలు పరవళ్ళు తొక్కుతున్న రోజుల్లో ‘పుష్పకవిమానం’ అనే మూవీక చిత్రాన్ని తీసి ఔరా అనిపించారు.
నిజానికి సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుడకి కమల్ హాసన్ వంటి నాయకుడు దొరకడం ఒక రకంగా ప్రేక్షకుల అదృష్టమే.. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా మరో సినిమాకు దగ్గరగా కూడా ఉండదు. అన్నీ వైవిధ్యమైనవే. దేనికదే సాటి. పుష్పక విమానం, అమావాస్య చంద్రుడు, విచిత్ర సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, ముంబై ఎక్స్ ప్రెస్.. ఇలా అన్నీ డిఫరెంట్ మూవీసే.. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో తమకు సాటిలేరని నిరూపించుకున్న చిత్రాలే ఇవన్నీ.
తెలుగులో సింగీతం చేసిన మరో అద్భుత చిత్రం మయూరి. ప్రముఖ నాట్య కళాకారిణి.. దివ్యాంగురాలైన సుధా చంద్రన్ లైఫ్ స్టోరీని ఆమెనే ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించిన చిత్రమిది. ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాట్యం పై మక్కువతో ఒక కాలు కోల్పోయినా జైపూర్ ఫూట్ తో మళ్లీ నృత్య కళాకారిణిగా ఎదిగిన విధానాన్ని సింగీతం తనదైన స్టైల్లో అదిరిపోయేలా చిత్రీకరించారు.
కమల్ హాసన్ అంటే ప్రయోగాలకు సిద్ధంగా ఉండే హీరో. మరి ఓ మాస్ హీరోను.. తన ప్రయోగంలో ఒప్పించడానికి సింగీతంకు చాలా గట్స్ కావాలి. కానీ తన కథపై నమ్మకంతో పాటు అలాంటి పాత్రలు చేయాలంటే తెలుగులో వేరే ఆప్షన్ లేదు కాబట్టే నందమూరి బాలకృష్ణతో ఆదిత్య 369 చేశాడు. కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య నటన అమోఘం అనిపిస్తే.. దర్శకుడిగా సింగీతం ప్రతిభ శిఖర స్థాయిలో కనిపిస్తుంది.
ఓ రకంగా చెప్పాలంటే సింగీతం ప్రతిభకు ఆదిత్య 369 తర్వాతే తెలుగులో పూర్తి స్థాయి ఆదరణ దక్కిందని చెప్పొచ్చు. ఆ ఊపులో అప్పటికే సాంఘిక చిత్రాలతో ఊరమాస్ సినిమాలతో ఊగిపోతున్న తెలుగు తెరకు చాలాయేళ్ల తర్వాత ఓ అందమైన జానపదాన్ని చూపించాడు. మళ్లీ బాలయ్యతోనే.. అదే భైరవద్వీపం. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిందే జానపద చిత్రాలతో. కానీ వాటిని మర్చిపోతున్న టైమ్ లో మరోసారి భైరవద్వీపంతో ఆ తరంలోని ప్రేక్షకులను అబ్బురపరిచారు సింగీతం..
సాంఘిక చిత్రాలతోనూ చిన్న ప్రయోగాలు చేసి.. పెద్దగా మెప్పించడం సింగీతం స్టైల్. అందుకే రాజేంద్ర ప్రసాద్ తో తీసిన రెండు సినిమాలూ అలాంటివే. బృందావనం.. అప్పటికే జంధ్యాల, ఇవివిల వెల్లువలో కామెడీ సినిమాలతో దూసుకుపోతున్న రాజేంద్రప్రసాద్ తో అదే తరహా కథాంశంతో చేసిన సినిమా. ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు.. అలాగే మేడమ్ సినిమా. కామెడీ హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ తో సినిమా అంతా లేడీ గెటప్ వేయించడం అంటే మాటలు కాదు. అయితే ..రాజేంద్ర ప్రసాద్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడు కాబట్టి ఆ పాత్ర రక్తి కట్టింది.
సింగీతం సినిమాల్లోకి కథ, కథనాల్లో ఎంత దమ్ము ఉటుందో.. సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాటలన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్సే. పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుటారాయన. అందుకే ఆ సినిమాల్లోని పాటలు నేటికీ అలరిస్తూనే ఉంటాయి. ఇలా వైవిధ్యమైన, సంగీత భరిత చిత్రాలతో కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు రూపొందించడం నిజంగా గొప్ప విషయమే.
వయసు పరంగా ఎంత పెద్దవారైనా.. మనసు పరంగా నేటి కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోని ప్రతిభ సింగీతం సొంతం. ప్రస్తుతం ఆయన వయసు 85కు చేరింది.. అయినా ఈ వయసులో కూడా తరగని ఉత్సాహంతో బాలకృష్ణతో ఆదిత్య 999.. తీస్తానంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే రెండేళ్ల క్రితం కూడా మరో వైవిధ్యమైన సినిమాతో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశారు.ఆ సినిమా వెల్కమ్ ఒబామా. అద్దె గర్భం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ తో ఏసుక్రీస్తు కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అయినా నేటి ట్రెండ్స్ ను నిశితంగా గమనిస్తూ.. ప్రతి విషయాన్నీ యూత్ ఫుల్ గా చెప్పడం ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమకు తార్కాణం.. అలాగే ఆ మధ్య వరుడు, చిన్ని చిన్ని ఆశ అనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసి ఆశ్చర్యపరిచారు..
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన మాయా బజార్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సింగీతం.. అప్పట్లో ఆ సినిమాలో పెట్టలేకపోయిన ఓ పాటను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్తగా రాయించి.. అదే ట్యూన్ లో చేయించి తనే మనవరాలితో కలిసి పాడి ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యే కోవిడ్-19 బారిన పడ్డా.. ధైర్యంగా ఫేస్ బుక్ లైవ్ చేసి.. నా బర్త్ డే రోజుతో క్వారంటైన్ ముగుస్తుంది అని చెప్పి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
సింగీతం కంటే వెనకే దర్శకులుగా కెరీర్ ఆరంభించిన చాలామంది ఎప్పుడో తెరవెనక్కి వెళ్లిపోయారు. వయసులోనూ.. ఇండస్ట్రీలో ఉన్న టైమ్ దృష్ట్యా ఆయన కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ సినిమాలు, హిట్లూ అందుకున్న ఎంతో మంది దర్శకులు ఇప్పుడు సినిమా గురించి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరు. కానీ 90యేళ్లకు అతి దగ్గరగా ఉన్న సింగీతం నేటికీ సినిమా తీయగలిగినంత ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆయనకు సినిమా అంటే ఎంత ప్యాషనో. ఆ ప్యాషనేట్ పర్సన్ ఇక లేడు అనడం అనేది అంత ఈజీగా డైజెస్ట్ కాని విషయం. ఏదేమైనా అక్కినేని నాగేశ్వరరావుగారిలాగే ఆఖరి క్షణం వరకు సినిమా జీవితాన్నే ఆస్వాదించిన అరుదైన దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావు పేరు చిరకాలం నిలుస్తోంది. ఆయన మరణానికి వినమ్రంగా నివాళి అర్పిస్తోంది గారడీ.కామ్.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి