Gaaradi Telugu news logo

రివ్యూ : డోరోతి
ఆర్టిస్ట్స్ : కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, రామచంద్రన్ దురైరాజ్, సౌందర రాజన్, ముత్తుకుమార్ తదితరులు
ఎడిటర్ : గణేష్ శివ
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : తిరు
నిర్మాతలు : గీతూ మొంగ కపూర్, జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

కొన్ని కథలు అందరికీ కనెక్ట్ కావు. ఇంకొందరికి మాత్రం విజిల్ బ్లోయింగ్ కథలుగా ఉంటాయి. బట్ కొన్ని కథల విషయంలో ఓ అడుగు ముందుకేస్తుంటారు. అలాంటి కథే డోరోతి. డోరోతి అంటే ఒక మనిషికి సంబంధించిన పేరు. ఇది తమిళ్ మూవీ. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఓ కీలక పాత్ర చేసింది. రిలీజ్ కు ముందే మలేషియా దేశం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. మరి అందుకు కారణాలేంటీ.. బ్యాన్ చేసేంత బలమైన కంటెంట్ ఏముంది ఈ చిత్రంలో ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
సుబ్బు(సనంత్) కార్తీ (రిషికాంత్) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. సుబ్బుది కాస్త పెద్ద కులం. కార్తీ చిన్న కులం వాడు. అయినా ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం ఉంటుంది. సుబ్బుది పెద్ద కుటుంబం. బాగా డబ్బున్నవాళ్లు కూడా. తండ్రి మరో ఇద్దరు అన్నలు ఉంటారు. అయితే అతని తల్లి, అక్క చిన్నప్పుడే సూసైడ్ చేసుకుంటారు. ఇటు కార్తీ వాళ్ల తండ్రి చనిపోతాడు. తల్లి ఓ చిన్న హోటెల్ నడిపిస్తుంది. ఈ ఇద్దరు స్కూలింగ్ అయిపోయిన తర్వాత పెద్దగా చదువుకోరు. ఆవారాగా తిరుగుతూ ఊరంతా గొడవలు పడుతుంటారు. సుబ్బు వాళ్ల చిన్న అన్న సడెన్ గా డోరోతి ( కీర్తి సురేష్) పెళ్లి చేసుకుని వస్తాడు. అప్పటి వరకు సుబ్బుకు కార్తీయే లోకం. సడెన్ గా డోరోతితో స్నేహం మొదలు పెడతాడు. ఎక్కువ సమయం ఒదినతోనే గడుపుతుంటాడు. ఈ విషయంలో కార్తీ చిరాకు పడుతుంటాడు. సుబ్బు వాళ్ల అన్నకు పెళ్లైన కొద్ది రోజులకే డోరోతి సూసైడ్ చేసుకుంటుంది. ఓ రకంగా హత్య కూడా కనిపిస్తుంది. డబ్బున్న వాళ్లు కాబట్టి పోలీస్ లను మ్యానేజ్ చేస్తారు. డోరోతి చనిపోయిన తర్వాత సుబ్బు కోసం, కార్తీ ఓ హత్య చేస్తాడు. ఆ కేస్ అతనిపై పడకుండా ఉండేందుకు సుబ్బు తండ్రి అతన్ని వేరే రాష్ట్రంలో లారీ నడిపించమని చెబుతాడు. కట్ చేస్తే సుబ్బు విషయంలో ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది అతని కుటుంబానికి. దీంతో అతన్ని చంపమని కార్తీతోనే చెబుతారు. మరి ఈ భయంకరమైన నిజం ఏంటీ..? కార్తీ కూడా సుబ్బును అసహ్యించుకుంటాడు. మరి అతనితో చంపుతాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :
డోరోతి.. ఇలాంటి కథలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. చాలా తెలివి కూడా ఉండాలి. డోరోతి చూసిన వాళ్లంతా ఈ కథను ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేరు. చూడ్డానికి ముందు చాలా ఊహించుకుని ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ లో కథనం సాగిన విధానం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు ఉంటాయి. అవన్నీ అత్యంత సహజంగా ఉంటాయి. ఊరిలో గొడవలు పడుతుండటం.. కొట్లాటల్లో ఉండటం.. చివరికి హత్యల వరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ హత్యలు చేయలేరు. కేవలం గొడవలతో ఆగిపోతుంటారు.
ఇక వీరి చిన్న తనంలో సుబ్బు బ్రూస్ లీ ఫ్యాన్. ఆ కారణంగా కరాటే ఫైట్లలాంటివి చేస్తూ కార్తీకి తోడుగా ఉంటాడు. పెద్దయ్యాక సుబ్బు స్లో అవుతాడు. కార్తీ స్పీడ్ అవుతాడు. సుబ్బుగా సనంత్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతనికంటే మించి రిషికాంత్ అదరగొట్టాడు. కీర్తి సురేష్ పాత్ర సినిమాలో ఓ చిన్న కీలకంగా ఉంటుంది. కానీ తన పాత్రను ఎండ్ చేసిన విధానం బాలేదు. లేదంటే జస్టిఫికేషన్ లేకుండా ఆ పాత్రను చంపడం బాలేదు.
ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. రిషికాంత్ లవర్ కు పెళ్లి కావడం.. ఆ సందర్భంగా వచ్చిన సన్నివేశాలు నవ్వించడం.. దీంతో పాటు ఆ కాలంలో ఉన్న కుల కట్టుబాట్లను లైట్ గా ఎలివేట్ చేయడం బావుంది. ఇటు సనంత్ కు జోడీ ఉండదు. కానీ చిన్నప్పటి క్లాస్ మేట్ తో మంచి రిలేషన్ మెయిన్టేన్ చేస్తాడు. ఆ కారణంగా ఓ సారి ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రి అతన్ని కొట్టే ప్రయత్నం చేయడం.. తర్వాత అతన్ని కన్విన్స్ చేసే కోణంలో అతనిపై హత్య జరగడం.. ఇవన్నీ చాలా వేగంగా సాగుతుంటాయి. కథనంలో ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి సీన్ లోనూ చాలా అంటే చాలా సహజత్వం కనిపిస్తుంది. సినిమాలో ఇదో మెయిన్ హైలెట్.
ఇక సెకండ్ హాఫ్ గురించి ఇప్పుడు చెప్పడం కంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా సుబ్బును చంపాలని కార్తీ ఫిక్స్ అయిన తర్వాత ఒకదాన్ని మించి ఒక సీన్ కనిపించడం.. ఆ టైమ్ కు అతన్ని చంపాలనే ప్రయత్నం అప్పటికి ఆపడం.. ఆపై మళ్లీ హత్య చేయాలని చూడ్డం.. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరికి సుబ్బును చంపడం అనేది జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా సినిమాలో చూడాలి.
ఏదేమైనా ఈ తరహా కథలు తెలుగువాళ్లకు సరిగ్గా కనెక్ట్ అవుతాయా అనేది పెద్ద పాయింట్. బట్ సమాజంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. అందరికీ ఆ బాధ తెలియకపోవచ్చు. కానీ ఆ బాధ తెలుసుకుంటేనే ఈ తరహా మనుషులను కూడా అంగీకరించాల్సి వస్తుంది. మరి ఈ అంగీకారం ఆడియన్స్ కు కూడా ఉంటే.. సినిమా రేంజ్ మరో స్థాయికి వెళుతుంది. లేదంటే అక్కడే ఆగిపోతుంది.

నటన పరంగా

కీర్తి సురేష్ ఓ రకంగా గెస్ట్ రోల్ అనుకోవచ్చు. బట్ మెయిన్ పాయింట్ ను హైలెట్ చేయడం బావుంది. ఇక రిషికాంత్, సనంత్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. సుబ్బు తండ్రి పాత్రలో ముత్తుకుమార్ అదరగొట్టాడు. అతని మేకోవర్ నెక్ట్స్ లెవల్ లో ఉంది. ఇతర పాత్రలన్నీ మనకు తెలియనివే. అయినా అందరూ చాలా సహజంగా నటించారు. అన్నట్టు ఈ చిత్రం 1995ల కాలంలో సాగుతుంది. ఆ మేరకు ఆ కాలాన్ని రీ క్రియేట్ చేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఎక్కడా ఇది ఈ కాలం అనిపించదు. అత్యంత సహజంగా చూస్తున్నంత సేపూ ఇది 1995లోనే ప్రేక్షకులూ ఆగిపోతారు.

టెక్నికల్ గా
ఇళయరాజా ఈ వయసులో కూడా అత్యద్భుతమైన సంగీతం ఇచ్చాడు. కొన్ని ఆయన ట్యూన్ చేసిన పాత పాటలను యధాతథంగా వాడారు. కొన్ని పాటలు అతను కూడా పాడాడు. క్లైమాక్స్ లో వచ్చిన ట్యూన్ మరో స్థాయిలో ఉంది. ఆర్ఆర్ ఈ సినిమాకే ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ అద్భుతం. ఎడిటింగ్ పరంగా కొన్ని మైనస్ లు ఉన్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. తెలుగు డైలాగ్స్, డబ్బింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.
దర్శకుడుగా కార్తీక్ సుబ్బరాజ్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కాలంలో ఈ రేంజ్ మేకింగ్ అతనికే సాధ్యం అనే చెప్పాలి. ఏదేమైనా ఈ కథను ఇంత ఎఫెక్టివ్ గా చెప్పిన కార్తీక్ సుబ్బరాజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఫైనల్ గా : డోరోతి .. మరో స్థాయి సినిమా
రేటింగ్ : 3.5/5

KYR

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి