అలీ.. చిన్న వయసులోనే సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరాడు. తెలుగు తెరపై చాటంత హాస్యం పంచాడు. యమలీలకు తలొగ్గని నాయకుడిగా రాణించి, ఆడియన్స్ కు అక్కుంబక్కుం పంచినవాడు. తేడా పాత్రలకు పెట్టింది పేరుగా.. నచ్చిమీ డోంట్ టచ్ మీ అంటాడు. పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నటుడిగా.. పూరీకి స్టోరీకి ముందే బుక్కయ్యే ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై నాలుగు దశాబ్ధాలకు పైగా నవ్వులు పూయిస్తోన్న జంబల్ హాట్ జలగండ్రి కాట్రవల్లి అలీ పుట్టిన రోజు ఇవాళ.
అలీది రాజమండ్రి. నిరుపేద కుటుంబం. కానీ చిన్నప్పటి నుంచే అతనిలో నటలక్షణాలున్నాయి. అందుకే బాల్యంలోనే ఎన్టీవోడు, ఏఎన్నారూ, అమితాబ్ లాంటి నటులను అనుకరిస్తూ హాస్యం పంచాడు. చిన్న వయసులోనే మిమిక్రీ కళతో పెద్ద వేదికలపై ఎంతో మంది పెద్దల ముందు నిర్భయంగా ప్రదర్శనలు చేశాడు. పైగా పసివాడిగా ఉన్నప్పటి నుంచే చాలా చురుకైన వాడు కూడా…
అలీ నటుడు కావాలని చిన్నప్పుడే మద్రాస్ రైలెక్కాడు. వెంటనే అవకాశాలు రాలేదు కానీ, భారతీరాజా తీస్తోన్న సీతాకోక చిలుక ఆడిషన్ లో ఆయన్ని బాగా మెప్పించి అందులో పాత్ర కొట్టేశాడు. సీతాకోక చిలుకలో అలీ పాత్రకు బాగా గుర్తింపు రావడంతో బాలనటుడిగా చాలా అవకాశాలే వచ్చాయి..
అలీ బాల నటుడిగా బాగానే చేసినా బాల్యం నుంచి కౌమారానికి వచ్చే టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. అడపా దడపా కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కొన్నేళ్ల తర్వాత యవ్వన ఛాయలు కనిపిస్తోన్న టైమ్ లోనే అతను చేసిన చాట క్యారెక్టర్ అలీకి తిరుగులేని గుర్తింపును తెచ్చింది.
హాస్య నటుడిగా అలీకున్న ప్రధాన బలం.. టైమింగ్.. అండ్ ఎక్స్ ప్రెషన్స్.. వీటితో పాటు డైలాగ్ డెలివరీ. అందుకే బాలనటుడి నుంచి కౌమారానికి వచ్చే సంధి కాలంలో కాస్త ఇబ్బంది పడ్డా నూనూగు మీసాల టైమ్ లో కూడా వెండితెరపై రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో అలీ వేసిన పాత్రలు అంత ఈజీగా మర్చిపోలేం.
అలీ పరిశ్రమలో నిలబడ్డానికి ఓ రకంగా కారణం ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి అనే చెప్పాలి. తమ ప్రతి సినిమాలోనూ అలీకి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారా ఇద్దరూ. ఎలాగూ అలీ కూడా అద్భుత ప్రతిభావంతుడే కాబట్టి, వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇవివి డైరెక్షన్ లో వచ్చిన హలో బ్రదర్ లో తాగుబోతు పాత్రలో అలీ చేసిన హంగామాను అంత ఈజీగా మర్చిపోగలమా..
అలీ అటు బాల్య ఇటు యవ్వనానికి మధ్యలో ఉండగానే చాలా పాత్రలు చేశాడు. విచిత్రమైన సౌండింగ్ తో అతను పంచిన కామెడీకి ప్రేక్షకులూ బ్రహ్మరథం పట్టారు. దీంతో అప్పటికే ఇండస్ట్రీలో బాగా ఫేమ్ అయిన ఉద్ధండులైన కమెడియన్స్ మధ్యలో తనకంటూ వైవిధ్యమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ.
అలీ నిజానికి దర్శకుల కమెడియన్. దర్శకుడు చెప్పిన దానికంటే ఎక్కువే పర్ఫార్మ్ చేశాడు. అందుకే అప్పటి అగ్రహీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చినా.. ప్రధానంగా కామెడీ సినిమాల్లోనే ఎక్కువగా సత్తా చాటాడు.
అలీ జీవితంలో అద్భుతమైన క్షణం.. ఓ రోజు ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి వచ్చిన ఫోన్ కాల్. అతన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్టు ఎస్వీ చెప్పగానే ముందు నమ్మలేదు.. తర్వాత పదివేలు అడ్వాన్స్ చేతిలో పెట్టాక నమ్మక తప్పలేదు. కానీ కమెడియన్ హీరో అంటే ఎక్కడో అనుమానాలున్నా.. వాటన్నిటినీ తుడిచివేస్తూ.. అలీ హీరోగా నటించిన తొలి సినిమా యమలీల బాక్సాఫీస్ ను టాప్ హీరోల రేంజ్ లో షేక్ చేసింది.
కమెడియన్స్ హీరోలు కావడం ఇండస్ట్రీలో కామనే కానీ, ఓ కమెడియన్ హీరోగా నటించిన సినిమా అంత పెద్ద హిట్ కావడం బహుశా.. యమలీలే ఫస్టేమో. యముడు, చిత్రగుప్తుడు పంచిన హాస్యం, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ ప్రతిభతో పాటు సంగీత పాటవం వెరసి యమలీల టాలీవుడ్ లోనే స్పెషల్ మూవీగా మారింది.
అలీ యమలీల తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ హీరోగానే సెటిల్ కావాలనుకోలేదు. అందుకే కమెడియన్ గానూ చేశాడు. అలా అటు హీరో, ఇటు కమెడియన్ అంటూ రెండు పాత్రలపై కాలు వేసిన అలీ ఆ రెండిటినీ పూర్తిగా బ్యాలన్స్ చేయలేకపోయాడు.. దీంతో కమెడియన్ పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు.
అలీ కెరీర్ లో అప్పుడప్పుడూ సంఖ్యా పరంగా వెనకబడ్డా ఎప్పుడూ ఖాళీగా మాత్రం లేడు. టాప్ కమెడిన్ గా తన స్థానానికి ఎప్పుడూ రిపేర్ రాలేదు. వచ్చినా చాలా తాత్కాలికమే అయింది. అందరు అగ్ర హీరోల సినిమాల్లోనూ కమెడియన్ గా సత్తా చాటాడు.
ఓ పదేళ్ల క్రితం టాలీవుడ్ లో కొత్త కమెడియన్స్ హవా బాగా పెరిగింది. దీంతో అలీ స్థానం కదులుతందనుకున్నారు. కానీ పూరీ జగన్నాథ్ పరిచయంతో అలీ మళ్లీ టాప్ రేస్ లోకి వెళ్లిపోయాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమాలోనూ అలీకి ప్రధాన పాత్ర ఇచ్చేలా ప్రోత్సహించాడు. దీంత ఈ ఇద్దరి సినిమాలో అలీకి ఖచ్చితంగా చోటు ఉంటోంది.
ముఖ్యంగా పూరీ తీసిన ఇడియట్, దేశముదురు, పోకిరి, సూపర్, చిరుత, లాంటి సినిమాల్లో అలీ పాత్రలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. ఈ అన్ని సినిమాల్లోనూ అలీ భిన్నమైన పాత్రలే చేశాడు.
ఇక తేడా, లేడీ పాత్రలు వేయడంలో అలీ తర్వాతే ఎవరైనా అన్నంతగా ఆ పాత్రల్లో పాపులర్ అయ్యాడు అలీ. హిజ్రాగా అలీ చేసిన అన్ని పాత్రలూ దాదాపు నవ్వించాయి. అలాగే లేడీగా వేసిన సినిమాలూ నేచురల్ గా నవ్వించాయి.
ప్రస్తుతం సినిమాలతో పాటు, కొన్ని టివి కార్యక్రమాలకూ వ్యాఖ్యాతగా, సొంతంగా యూ ట్యూబ్ రన్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్, టాప్ కమెడియన్ గా ఉన్న అలీ ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది గారడీ.కామ్.
