Gaaradi Telugu news logo

ఎస్.ఎస్. రాజమౌళి.. ఇరవైయేళ్ల క్రితం..శాంతి నివాసం అనే టివి సీరియల్ తో ఆకట్టుకున్న కుర్రాడు. తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణతో ఒక విద్యార్థిగా.. మరో విద్యార్థి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ కథ.. అందర్నీ ఆకట్టుకుంది.అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆ కుర్రాడు.. అటుపై బ్లాక్ బస్టర్స్ కే బోర్ కొట్టేలా తెలుగు సినిమాఖ్యాతిని ను ఎవరెస్ట్ ఎక్కించాడు.. ఇంతింతై బాహుబలి,ఆర్ఆర్ఆర్ అంతై త్వరలో వారణాసి అంత కాబోతోన్న దర్శకుడు దర్శకుడు రాజమౌళి.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు రాజముద్ర వేసిన రాజమౌళి.


తొలి సినిమా తీసి పదహారేళ్లు.. ఈ పదహారేళ్లలో తీసింది బాహుబలి ద కంక్లూషన్ తో కలిసి 11 సినిమాలు. కానీ రాజమౌళి అన్న పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.. కేవలం 11 సినిమాలతోనే అతను ఈ స్థాయికి రావడానికి కారణాలేంటీ..? 11 సినిమాలే చేసినా.. ప్రపంచమంతా అబ్బురపడిపోయే సినిమా ఎలా తీయగలిగాడు.. అంటే అదే రాజమౌళి అంటారెవరైనా.. నిజానికి బాహుబలి వరకూ రావడం వెనక అతని జర్నీ చూస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తాయి.. వైఫల్యం ఎరుగని ఆ ప్రయాణం వెనక విఫలమైన ప్రయోగాలూ, పాఠాలూ కనిపిస్తాయి..

రాయిచూర్ నుంచి వచ్చాడు రాజమౌళి. అసిస్టెంట్ వీడియో ఎడిటర్ గా.. ఇప్పుడు తన ప్రతి సినిమాకూ ఎడిటింగ్ చేస్తోన్న కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. కానీ 24విభాగాల్లో ఏదో ఒక దానికే పరిమితం కావాలనుకోలేదు. 24విభాగాలనూ సమన్వయం చేయాలనుకున్నాడు. అప్పుడే రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ గా కొత్త ప్రయాణం మొదలైంది.

సినిమా పట్ల ఉన్న ప్యాషన్.. రాజమౌళిని అన్ని విషయాలు ఫాస్ట్ గా నేర్చుకునేలా చేసింది. దీంతో తక్కువ టైమ్ లోనే రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం సీరియల్ కు ఆయన పర్యవేక్షణలో దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు.. తర్వాత మళ్లీ రాఘవేంద్రుడి పర్యవేక్షణలోనే స్టూడెంట్ నెంబర్ వన్ వచ్చింది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలు.. రాజమౌళిలో ఎంత టాలెంట్ ఉందో తెలియడానికి..
2001లో వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్. అప్పటికి రాజమౌళి ప్రతిభ పూర్తిగా తెలిసిందని చెప్పలేం. కానీ 2003లో వచ్చిన ఓ సినిమా తెలుగు సినిమాను ఉలిక్కిపడేలా చేసింది. హీరో నుంచి దర్శకుడి వరకూ.. ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసిన సందర్భం అది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా.. రాజమౌళి మార్క్ స్పష్టంగా కనిపించే సినిమా ఇది. స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, లవ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ అన్నిటినీ కరెక్ట్ గా మిక్స్ చేసుకుని.. రాజమౌళి చేసిన మ్యాజిక్ కు రికార్డులన్నీ దాసోహమైపోయాయి.
తర్వాత అప్పుడప్పుడే స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తోన్న కుర్రాడు నితిన్ తో సై.. ఈ కాలేజ్ ఎంటర్టైనర్ కు యూత్ అంతా ఫిదా అయిపోయారు. కాలేజ్ గొడవలకూ.. ఓ గేమ్ ను జోడించి చేసిన ప్రయోగం పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చినా. సింహాద్రి చూసిన కళ్లతో చూసిన వారికి సై పెద్దగా నచ్చలేదు. కానీ ఇందులోనూ రాజమౌళి మార్క్ సీన్స్ చాలానే కనిపిస్తాయి.
రాజమౌళి ఇప్పుడు బాహుబలి చేయడానికి కారణమైన సినిమా ఏంటో తెలుసా.. ఛత్రపతి.. ఛత్రపతికీ బాహుబలికీ సంబంధమేంటీ అనుకుంటున్నారా..? ఉంది.. పెద్ద సంబంధమే ఉంది. తీసిన మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన రాజమౌళిని మరో మెట్టు పైన చూపించిన ఛత్రపతి.. ఒక్క విషయంలో మాత్రం చాలా మెట్లు తక్కువగా చూపించింది.. ఆ సీనే అతనిలో కసి నింపింది.. ఆ సీనే.. రాజమౌళిలోని ఫైర్ ను బాహుబలి వరకూ తెచ్చింది.. అంటే ఆ సీన్ రాజమౌళిని ఇబ్బంది పెట్టినట్టే కదా..

చూశారు కదా.. ఈ షార్క్ ఫైటే రాజమౌళిలో ఫైర్ ను రగిల్చింది. ఈ ఫైట్ లో రాజమౌళి చేయించిన గ్రాఫిక్స్ కు అప్పట్లో చాలామంది నవ్వుకున్నారు. అత్యంత నాసిరకంగా ఉన్నాయని.. విమర్శలు వచ్చాయి. నిజంగానే అవి నాసిరకం గ్రాఫిక్స్.. అదుగో అప్పుడు పడింది ఈ గ్రాఫిక్స్ పై ఇంట్రెస్ట్. కమర్షియల్ హిట్స్ లో ఛత్రపతి నిజంగానే బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి అనిపించుకున్నా రాజమౌళిలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. తాను ఇంకేదో చేయాలన్న కోరికను రగిలించింది.
ఛత్రపతి తర్వాత రవితేజతో విక్రమార్కుడు. కమర్షియల్ ఫార్ములాను ఏ మాత్రం దాటని ఈ సబ్జెక్ట్ తో ఇంకెవరైనా సినిమా చేస్తే ఎలా ఉండేదో కానీ.. తొలి సినిమా నుంచీ ఈ ఫార్ములానే నమ్ముకున్న రాజమౌళి ఎంటర్టైన్ చేశాడు. ఎమోషన్ పండించాడు.. కన్నీళ్లు పెట్టించాడు.. కడుపుబ్బా నవ్వించాడు.. అదిరిపోయే పాటలూ చూపించాడు. అందుకే విక్రమార్కుడు అందరు పోలీసుళ్లాంటోడు కాదన్నారు ఆడియన్స్..
మనమెందుకు మంచి గ్రాఫిక్స్ తో సినిమా చేయలేం.. ఇదీ.. అతనిలో రగులుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు కొంత సమయం తీసుకుని.. ఛత్రపతి షార్క్ ఫైట్ లో హేళన చేసిన వారంతా నోటి మీద వేలేసుకునేలా.. తన వర్క్ చూసి తనే కాన్ఫిడెంట్ గా ఫీలయ్యేలా యమదొంగ చేశాడు. అప్పటి వరకూ హీరోయిజాన్ని.. ఎమోషనల్ కంటెంట్స్ ను పీక్స్ లో చూపిస్తాడనుకున్నవారికి భిన్నంగా యమదొంగలో అదిరిపోయే గ్రాఫిక్ వర్క్ చూపించాడు. తనపై వచ్చిన విమర్శలకూ మళ్లీ సినిమాతోనే సమాధానం చెప్పాడు..

ఆర్టిస్టుల్లోని టాలెంట్ ను పూర్తిస్థాయిలో వాడుకోవడం రాజమౌళికి బాగా తెలుసు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ యమదొంగ తనను తను ప్రూవ్ చేసుకున్న సినిమా. సినిమా పరంగా, కథ పరంగా గుణశేఖర్ అన్నట్టు అన్నీ నిజంగానే సింపుల్ స్టోరీస్. కానీ ఆ కథల్ని రాజమౌళి బ్లెండ్ చేసే తీరే.. ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. మొత్తంగా షార్క్ గ్రాఫిక్స్ వైఫల్యంతో యమలోకాన్నే సృష్టించే పాఠం నేర్చుకున్నాడు రాజమౌళి.

యమదొంగ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తే.. రాజమౌళికి కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అదే మగధీర వంటి సినిమాకు కారణమైంది. మగధీర.. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. బాలీవుడ్ సైతం భయపడేలా చేసిన సినిమా. ఓ దర్శకుడి ఊహాశక్తికి నిదర్శనంగా నిలిచిన సినిమా. రెండు జన్మల కథ. ఒక జన్మలో విడిపోయి మరో జన్మలో కలుసుకుంటారు. కథ మళ్లీ పాతదే.. కానీ మగధీర చూసిన ఎవరైనా ఈ మాట అనగలరా..?
మగధీర రాజమౌళి కలలకు తొలి భారీ విజయం.. ఆ విజయం అంతులేని విశ్వాసాన్ని నింపింది. కానీ తొందరపడలేదు. తనపై అంచనాలు తగ్గిస్తేనే తన నుంచి వచ్చే అవుట్ పుట్ ను ప్రేక్షకులు ఇష్టపడతారని గ్రహించాడు. అందుకే మగధీర తర్వాత ఏ మాత్రం తొందరపడకుండా మెల్లగా అడుగు వేశాడు.. కానీ మగధీర ఇంపాక్ట్ తెలుగు ఇండస్ట్రీపై ఓ పదేళ్లపాటైనా ఉండేలా తన రాజముద్ర వేశాడు.
మగధీర వంటి ఎపిక్ హిట్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడనే క్యూరియాసిటీ అందర్లోనూ ఏర్పడింది. ఎవరికి వారు ఓ స్థాయిలో అంచనాలు వేసుకుంటున్నారు. ఆ టైమ్ లో అనౌన్స్ చేసిన రాజమౌళి ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేశాడు. ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు. కమెడియన్ సునిల్ తో మర్యాద రామన్న సినిమా అది. ఎక్కడి మగధీర.. ఎక్కడి మర్యాద రామన్న.. బట్ రిజల్ట్ లో తేడాల్లేవ్..

2010లో వచ్చింది మర్యాద రామన్న. ఈ సినిమా తీయడానికి మగధీర ఓ కారణం అని చెప్పుకున్నారా మధ్య. అప్పుడే మెగా ఫ్యామిలీతో ఇకపై సినిమా తీయను అన్నాడు రాజమౌళి అనే వార్తలూ వినిపించాయి. ఆ మాటలు ఎలా ఉన్నా.. తను తీస్తే హిట్.. అనేది మరోసారి ప్రూవ్ చేశాడు. రాజమౌళి ఇచ్చిన కాన్ఫిడెన్స్ కు సునిల్ కూడా తను కమెడియన్ అనే విషయం మర్చిపోయి చాలా కాలమే అయింది.

ఈగ.. ఈగతో సినిమా ఏంటీ అని చాలామంది ఎద్దేవా చేశారు. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ప్రజెంట్ చేసే రాజమౌళి ఈగతో సినిమా చేయడం ఏంటీ అని అతని ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారు. అందుకోసం రెండేళ్లు టైమ్ తీసుకున్నాడు. ముందు సాదాసీదా ప్రాజెక్ట్ గా మొదలైన ఈగ.. తర్వాత రాజమౌళి విజన్ కు బెండ్ అయ్యి భారీ బడ్జెట్ మూవీగా మారింది. అప్పుడు ఇంకా విమర్శలు పెరిగాయి. హాలీవుడ్ కు మాత్రమే సాధ్యమయ్యే విజువల్ ఎఫెక్ట్స్ తో మనం సినిమా చేయగలమా.. ఈగ తర్వాత నిర్మాత కనిపించడం కష్టం అన్నారు.

ఈగ మొదలైంది.. సమంత ప్రధాన పాత్రలో.. నాని ఈగ పాత్రలో. విలన్ గా మనకెవరికీ పెద్దగా తెలియని కన్నడ స్టార్ హీరో సుదీప్. రోజుకో వార్త.. ప్రతి వార్తనూ కొత్తగా అందించాడు రాజమౌళి. మార్కెటింగ్ స్ట్రాటజీ.. ఆ స్ట్రాటజీతోనే ఆడియన్స్ లో మెల్లగా ఈగపై ఇంట్రెస్ట్ పెంచాడు. తర్వాత అది క్యూరియాసిటీగా మారింది. రాజమౌళికి కావాల్సింది ఇదే. దాన్ని మరింత పెంచాడు. అంతే ఆడియన్స్ ఈగ కోసం ఈగర్ గా వెయిట్ చేయడం మొదలుపెట్టారు.

ఈగ విడుదలైంది.. ఇది ఈగ కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తన్నుకోపోయే డేగ అన్నారు. హాలీవుడ్ కు మాత్రమే సాధ్యమనుకున్న.. అంతపెద్ద గ్రాఫికల్ వండర్ ను ఓ మాస్ మసాలా మూవీస్ తీసే కమర్షియల్ డైరెక్టర్ సాధించాడు. అంతే.. రాజమౌళి ఇన్నాళ్లూ మనం అనుకుంటోన్న దర్శకుడు కాదన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై కమాండ్ పెంచుకున్న రాజమౌళి ఏకంగా బాహుబలికి శ్రీకారం చుట్టాడు.
ఈగ లాంటి ఎపిక్ చూసిన తర్వాత రాజమౌళి బాహుబలి అనౌన్స్ చేసినప్పుడు ఆశ్చర్యపోయిన వారు లేరు. కానీ బడ్జెట్ పై కొన్ని కమెంట్స్. కానీ పని తప్ప మరేదీ పట్టించుకోని వర్క్ హాలిక్ కదా జక్కన్న..అందుకే అవేవీ పట్టించుకోలేదు. బాహుబలి కాస్టింగ్ చూశాక.. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ లో చూపించే సినిమా అనుకున్నారు. కానీ అది తెలుగు సినిమాను కాదు.. ఇండియన్ సినిమానే ఇంకో లెవెల్లో చూపిస్తుందని అప్పుడెవరికి తెలుసు..
బాహుబలి విషయంలోనూ అంతే పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతో ప్రతి విషయాన్ని వాల్యూబుల్ గా ప్రజెంట్ చేశాడు. ఆడియన్స్ లో ఆ సినిమాపై ఉన్న క్యూరియాసిటీ కొద్దీ.. అన్ని మీడియంలు అడక్కుండానే ప్రమోషన్ చేసేశాయి. అది బాలీవుడ్ నూ ఆకట్టుకుంది. అక్కడి నుంచీ బిజినెస్ మొదలైంది. తర్వాత ట్రైలర్.. అంతే.. మనం ఓ అద్భుతాన్ని చూడబోతున్నాం అని ముందే ఫిక్స్ అయ్యారాడియన్స్. అంతేనా.. బాహుబలి చూడకపోతే ప్రేక్షకుడే కాదు అన్నంతగా ఆ ఫీవర్ ప్రతి ఒక్కరినీ తాకింది.
బాహుబలి దెబ్బతో ఎంటైర్ సౌత్ బాహుబలికి ముందు తర్వాత అన్నట్టుగా మారిపోయింది. ఏరికార్డ్ గురించైనా మాట్లాడాలంటే నాన్ బాహుబలి రికార్డ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెండితెరపై ఓ దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. వందలమంది కష్టం.. ఎందరిదో మేధస్సు.. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆ అద్భుతాన్ని ఆడియన్స్ కు అందించాడు రాజమౌళి.. కానీ ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి..

ఇక రెండో భాగం.. బాహుబలి ద కంక్లూషన్.. ఫస్ట్ పార్ట్ లో ఏం మిస్ అయ్యారో అవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువే చూపించి ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. కొన్ని రకలా ఎమోషన్స్ కు పీక్స్ లో చూపించడంలో రాజమౌళిని మించిన వారు లేరని బాహుబలి ద కంక్లూషన్ లో మరోసారి చూపించాడు.. ప్రస్తుతం బాహుబలి అంటే ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ సినిమా ముందు సగర్వంగా నిలిపిన సినిమా.

అన్ని రికార్డులూ కనుమరుగయ్యాయి. కలెక్షన్ల సునామీ వస్తూనే ఉంది. ఇక బాహుబలి తెలుగు సినిమా ఎంత మాత్రం కాదు.. ఇండియన్ సినిమా. భారతీయులంతా మా సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా. మొత్తంగా స్టూడెంట్ నెంబర్ వన్ తో విద్యార్థిగా మొదలైన రాజమౌళి సినిమా ప్రయాణం.. ఇప్పుడు ఎందరో మేకర్స్ కు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ స్థాయికి చేరిందంటే కారణం.. కేవలం నేర్చకోవాలన్న తపన.. కృషి, పట్టుదల.. క్రమశిక్షణ మాత్రమే..

ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేస్తున్న టైమ్ లో రాజమౌళి విజన్ పై ఎవరికీ ఇబ్బంది లేదు. అతను చెక్కిన ప్యాన్ ఇండియా స్టార్స్ గా తిరుగులేని నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. స్వాతంత్ర్య పూర్వం జరిగే కథగా వచ్చిన ఆర్ఆర్ఆర్ వాల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది. బాహుబలి మేనియాతో ఆర్ఆర్ఆర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అంతకు మించి ఇండియన్ సినిమాకు.. ఇంకా చెబితే ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిన ఘనత ఆర్ఆర్ఆర్ ది.
రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి చేస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, వారణాసి ఒకెత్తు అనేలా దాన్ని చెక్కుతున్నాడు. ఇక రాజమౌళి విజన్ పై ఇప్పుడెవరికీ అనుమానాలు లేవు. ఆడియన్స్ అంచనాలను దాటి ఆకట్టుకోవడమే ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ప్రధాన విషయం.
మొత్తంగా ఛత్రపతిలో చిన్న సీన్ తో మొదలైన ఆలోచన ఇప్పుడు వేల మెదళ్లను కదిలించింది. కోట్లమంది ప్రేక్షకుల్ని రంజింపచేస్తోంది. అందుకే అంటారు.. విజన్ ఉన్నవాడికి విజ్డమ్ తోడైతే విశ్వమంతా దాసోహమవుతుందని.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా పునాదులపై భారతీయ సినిమా అన్న జెండా ఎగరేస్తోన్న రాజమౌళి భవిష్యత్ లో మన సినిమాను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరుకుందాం.సాహోరే రాజమౌళి అంటూ బర్త్ డే విషెస్ చెబుతోంది గారడీ.కామ్.

KYR

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి