ఏఎన్నార్ జయంతి స్పెషల్
అక్కినేని ఎక్కలేని ఎత్తుల్లేవు…అక్కినేని తొక్కలేని స్టెప్పుల్లేవు…అక్కినేని చేయలేని పాత్రల్లేవు…ఇలా అక్కినేని దండకం రాశారో సందర్భంలో ముళ్లపూడి. అది అక్షరసత్యం. ఏ పాత్రకైనా ఇట్టే ఇమిడిపోయే మనిషి కాకపోయినా.. పాత్రను అధ్యయనం చేసి ఏ పాత్రనైనా రక్తి కట్టించగల నట పరిశోధకుడు అక్కినేని. అదే ఆయన సక్సస్ మంత్రం. ఆ మంత్రాన్నే వెండితెరపై చూపించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటుగా తెలుగు సినిమా పరిశ్రమకు రెండుకళ్లుగా అభివర్ణించేంతటి ప్రాభవాన్ని చూపించారు. ఇవాళ నటసామ్రాట్ జయంతి..
ఎఎన్నార్ నటుడుగా పరిచయమైంది పౌరాణికంతోనే అయినా… ఆ తర్వాత చేసినవి వరసగా జానపదాలు. అప్పటికి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు అక్కినేని. ఆ తర్వాత సోషల్ హీరోగా, నవలా నాయకుడుగా కొత్త స్టైల్స్ లో ఛార్మ్ తో మెరిసారు. ముఖ్యంగా అక్కినేని చూపులు చురకత్తుల్లా ఉండేవి. ఆయన గ్లామర్ రహస్యం ఆ చూపులే అని ముక్తకంఠంతో తేల్చేసింది ఇండస్ట్రీ.
జానపదాల వైపు వెళ్లని ఏఎన్నార్
పాతాళభైరవి సక్సస్ తర్వాత తాను జానపదాల జోలికి పోకూడదనుకున్నారు ఎఎన్నార్. ఆ ఏరియాలో తనకన్నా పవర్ ఫుల్ నటుడు వచ్చాడనేదే కారణం. తను మాత్రమే చేయగల పాత్రల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సాంఘిక చిత్రాల కథానాయకుడుగా తనను తాను మలచుకున్నారు. దేవదాసుతో విజయపతాకం ఎగరేశారు. భగ్నప్రేమికుడు గా నటించాలంటే అక్కినేనే అనే పాపులార్టీ సంపాదించుకున్నారు.
బాలనటుడుగా ధర్మపత్నిలో తెరంగేట్రం చేశారు అక్కినేని. కొంత గ్యాప్ తర్వాత యవ్వన ప్రారంభంలో సీతారామజననంలో శ్రీరాముడుగా చేసిన అక్కినేని ఆ తర్వాత జానపద నాయకుడుగా కత్తిదూసి తెలుగు తెర తొలి సూపర్ స్టార్ అయ్యారు. వరసగా బాలరాజు, ముగ్గురు మరాఠీలు, కీలుగుర్రం చిత్రాలతో అక్కినేనికి తిరుగులేదనిపించారు. నిజానికి పాతాళభైరవి పాత్రకు ముందు అనుకున్న నటుల్లో ఎఎన్నార్ కూడా ఉండడం విశేషం.
తనను తీర్చిదిద్దుకున్న ఏఎన్నార్
నాగేశ్వరరావు అందగాడు కాదు…నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు. కంఠం అంత కన్నా లేదు. ఒడ్డూ పొడుగూ విగ్రహం లేదు. బాషా పాండిత్యం లేదు. ఇంతెందుకు నటుడికి కావలసిన లక్షణాలు అసలు లేవు. అయినా-హీరో అయ్యాడు…ఇప్పటికీ హీరోగా ఉన్నాడు..ఇంకా ఉంటాడు…ఇవి ఆత్రేయ అక్కినేని గురించి చెప్పిన మాటలు. అయినా ఎందుకు అంత పెద్ద నటుడయ్యాడు అంటే.. ముందే చెప్పినట్టు ఆయన నట పరిశోధకుడు. అందుకే ఎవరెన్ని అనుకున్నా.. తను చేసిన అన్ని పాత్రల్లోనూ అద్భుతం అనిపించారు. అఖండ విజయాలు అందుకున్నారు.
అక్కినేని నిరంత విద్యార్ధి. స్వీయలోపములెరుగుట పెద్ద విద్య అనే విషయం ఆయన బలంగా నమ్మారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలకు తనను తాను అడాప్ట్ చేసుకున్నారు.
ఆడవాళ్లంతా అక్కినేనికి అభిమానులే
సాంఘికాలే చేయాలనుకున్నా…మొనాటనస్ కాకుండా చూసుకున్నారు. ప్రతి పాత్రా ప్రత్యేకంగా ఉండేలా తనను తాను తర్ఫీదు చేసుకున్నారు. ఆ తపనే ట్రాజడీ కింగ్ అనే పేరొచ్చాక అదరిపోయే కామెడీ చేయించింది.
ఎఎన్నార్ కన్నా ఎన్టీఆర్ వయసులో పెద్దవారు. చదువు, పర్సనాల్టీ వాయిస్ లాంటి విషయాల్లో అయితే అసలు పోలికే లేదు. అయినా అక్కినేని జంకలేదు. తన మీద తనకు అపారమైన నమ్మకం. దీంతోనే అంతటి ఎన్టీఆర్ కు గట్టిపోటీ ఇచ్చారు. నవలా చిత్రాల కథానాయకుడుగా మహిళా ప్రేక్షకుల మనసుల్లో కొలువుతీరాడు. క్లాస్ హీరో అనిపించుకున్నాడు.
అక్కినేనికి ముందు చూపు ఎక్కువ. తనను తాను కొత్త తరహా పాత్రల్లో ప్రేక్షకులకు పరిచయం చేసుకోడానికి సొంత నిర్మాణ సంస్ధ ఉండడం శ్రేయస్కరం అనుకున్నారు. అంతే తను ఛైర్మన్ గా గురువు దుక్కిపాటి మధుసూధనరావు మేనేజింగ్ డైరక్టర్ గా, డిస్ట్రిబ్యూటర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు డైరక్టర్లుగా అన్నపూర్ణ పిక్చర్స్ అనే బ్యానర్ ప్రారంభించి కె.వి.రెడ్డితో దొంగరాముడు తీశారు.
ఎన్టీఆర్ తో 14 సినిమాలు
తనదైన పంథాలో కొనసాగుతూనే…ఎన్టీఆర్ తో కలసి సుమారు పద్నాలుగు సినిమాల్లో నటించారు. వాటిలో పౌరాణికాల సంఖ్యే అధికం. కేవలం తన నటనతోనే ఎన్టీఆర్ తో పోటీ పడేవారాయన. మాయాబజార్ లో అభిమన్యుడుగా గ్లామర్ ఒలికిస్తారు. శ్రీ కృష్ణార్జున యుద్దంలో అర్జునుడుగా ఎన్టీఆర్ ను ఢీకొంటారు. భూకైలాస్ సినిమాలో నారదుడి పాత్రలో ఎన్టీఆర్ ను ముప్పతిప్పలు పెడతారు.
నటుడుగా తానేం చేయాలనే విషయంలో నిరంతరం పరిశోధన సాగిస్తూనే వచ్చారు ఎఎన్నార్. తన్ను తానొక బంక మట్టిగా భావించుకున్నారు. దాన్ని తానే మర్ధించాడు. మదించాడు.అందులో రాళ్ళూ రప్పలూ,నలుసులూ పొలుసులూ ఏరి పారేసుకున్నాడు. తనకొక రూపాన్ని నిర్ణయించుకొని,తీర్చి దిద్దుకున్నాడు. ఒక మూర్తిగా తయారయ్యాడు. మనం దాన్ని ఆదర్శమూర్తి అందాము.
ప్రేక్షకుల ఆలోచనల్లోనూ, అభిరుచుల్లోనూ వస్తున్న మార్పులను చాలా జాగ్రత్తగా గమనించేవారు అక్కినేని. తనను తాను మౌల్డ్ చేసుకునేవారు. ఈ క్రమంలో భాగంగానే…ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఏ పనిచేసినా కృషే. ప్రేక్షకులకు కొత్త నాగేశ్వరరావును పరిచయం చేయడం కోసం కొత్త దర్శకులతో సినిమాలు చేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగానే విశ్వనాథ్ తో ఆత్మగౌరవం తీస్తే…బాపు బుద్దిమంతుడుగా ద్విపాత్రాభినయం చేయించారు.
పాత్రను అవగాహన చేసుకోవడంలో అక్కినేని ఓ డిక్షనరీ. ఓ పాఠశాల. నవరసాలనూ అవలీలగా పోషించాడు కాబట్టే ఈ నటుడు నటసామ్రాట్టయ్యాడు. ఏఎన్నార్ సినిమాల్లో తనతో పాటు హీరోయిన్ల పాత్రలూ చాలా బలంగా ఉంటాయి. ఇమేజ్ తో కాకుండా కథను బట్టే ఆయన జడ్జిమెంట్ ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్ని సినిమాలైనా చెప్పొచ్చు.
హీరోగా స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకాడలేదు అక్కినేని. అందులో తెలుగువారి మదిలో ఎప్పటికీ నిలిచిపోయే మిస్సమ్మ ఒకటి. డిటెక్టివ్ నంటూ తెగ హడావిడీ చేస్తూ సాగే ఆయన నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఎన్టీఆర్ తో పాటుగా తన నటనతో ఆ పాత్రను మరింత ఉన్నతంగా నిలబెట్టారు.
ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నంలో భాగంగానే…తెలుగు తెరకు డాన్సులు పరిచయం చేశారు. దసరాబుల్లోడు కు ముందు తెలుగు సినిమా హీరో పెద్దగా డాన్సులు చేసేవాడు కాదు. ఆయన పాడుతూ ఉంటే హీరోయిన్ డాన్స్ చేయడం రివాజు. దీన్ని సమూలంగా మార్చి కేవలం తన స్టెప్పులతో ధియేటర్లను మోతెక్కించారు అక్కినేని.
మొత్తం 256 చిత్రాలు చేసిన ఏఎన్నార్
మనంతో కలిపి అక్కినేని నటించిన చిత్రాల సంఖ్య 256. అందులో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలే రెండొందల పైచీలుకు ఉంటాయి. అక్కినేని ఎన్నడూ తన స్థాయికి తగని చిత్రాలు చేయలేదు. పాత్రల్లో నటించలేదు. చివరి రోజుల వరకు దాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చారు. సోలోగా ఆయన చివరి సూపర్ హిట్ ప్రేమాభిషేకమే అయినా… మేఘసందేశం, సీతారామయ్యగారి మనవరాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
తాను అభిమానించే నటుడు నాగయ్య ధరించిన వాల్మీకి పాత్రలో శ్రీరామరాజ్యంలో కనిపించిన ఎఎన్నార్ తన కుటుంబ హీరోలతో చేసిన మనం తో అభిమానులకూ.. ప్రేక్షకులకూ గొప్ప అనుభూతిని మిగిల్చారు. ఎన్నడూ ఓడిపోని నటుడాయన. దిలీప్ కుమార్ లాంటి నటుడి నుంచి ప్రసంశలు అందుకున్న అక్కినేని భౌతికంగా మన మధ్య లేకపోయినా…తెలుగువారి జ్నాపకాల్లో మాత్రం చిరంజీవిగా ఎప్పటికీ ఉండిపోతారు.
ఏఎన్నార్ మరణంలోనూ హీరోగానే వెళ్లిపోయాడు. తన మరణానికి ముందే అయినావాళ్లను అభిమానులను ప్రిపేర్ చేశాడు. చావును సవాల్ చేస్తున్నా అని హీరోలానే ఎదురుతిరిగాడు. ఏదో ఒక సినిమాలో తన పాత్ర చివరలో చనిపోతుంది అన్నంత సహజంగానే అంతర్థానమయ్యారు. అందుకే ఏఎన్నార్ మరణం ఓ పాత్ర ముగిసినట్టుగానే అనుకున్నారు జనం. కానీ అలాంటి పాత్రలతో చరిత్ర సృష్టించిన ఆ రూపం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందనేది నిజం.. అందరికీ తెలిసిన ఆ నిజాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఇదీ నట సామ్రాట్ జయంతి స్పెషల్.
- KYR
