రివ్యూ : డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్
ఆర్టిస్ట్స్ : ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్, వెంకటేష్ కాకుమాను, సౌరభ్ సచ్ దేవ్, సుబ్బరాజు తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీ
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫీ : బ్రాడ్ ఫ్రాన్సిస్
నిర్మాతలు : కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం : శశాంక్ ఏలేటి
రిలీజ్ డేట్ : 02.10.2026
డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా ఇదో మళయాల మూవీ అనుకున్నారు. అందుకు కారణం ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించడమే. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత లుక్ మారింది. ఇది ఫహాద్ నటించిన డైరెక్ట్ తెలుగు మూవీ అని తేలిపోయింది. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తీసుకు రావడంతో హైప్ పెరిగింది. దీనికి తోడు మహేష్ బాబు ట్వీట్ చేయడం.. ఎన్టీఆర్ ఈ మూవీని బాగా మోసేయడం కూడా చాలామందికి ఆసక్తిగా కనిపించింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ సోసియో ఫాంటసీ కథ అని ముందే అర్థమైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
సూరి(ఫహాద్ ఫాజిల్) ఓ అనాథ. ఓ అంబులెన్స్ ను నడిపిస్తుంటాడు. చిన్న చిన్న తప్పుడు పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో చాలా పెద్దవారితో పెట్టుకుంటాడు ఓ సారి. దీంతో వారు రెండు రోజుల్లో 25 లక్షలు ఇవ్వాలని అతనికి వార్నింగ్ ఇస్తారు. దీంతో ఓ మెజీషియన్ డ్రెస్ వేసుకుని ఈ డబ్బు కోసం ప్రయత్నిస్తూ దొరికిపోతాడు. అక్కడి నుంచి పారిపోతున్న టైమ్ లో అతనికి దివ్య( సారా పాలేకర్) అనే పాప పరిచయం అవుతుంది. ఆ పాప కోటీశ్వరుడు అని తెలిసి ఆమెకు తెలియకుండా కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆ పాప తనో మెజీషియన్ అని ఫీలవుతూ.. తన తల్లిదండ్రులను నేను మాయం చేశానని.. తిరిగి వారిని తీసుకు రావాలని అందుకోసం నువ్వు మ్యాజిక్ చేయమని అడుగుతుంది. ఇదే అదనుగా సూరి ఆమెను అడ్డం పెట్టుకుని ఆమె కుటుంబ సభ్యుడితో కోట్లకు బేరం పెడతాడు. ఇదీ కూడా వర్కవుట్ కాదు. అప్పుడే అసలు ఆ పాప మనిషి కాదు.. ఆత్మ అని తెలుస్తుంది. అంతే కాదు ఆమెకు మాయలు చేయడం వస్తుంది. ఇదే అడ్డం పెట్టుకుని సూరి ఆ పాప సాయంతో కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో పోలీస్ లకు చిక్కుతాడు. అక్కడి నుంచి కథలో అనేక మార్పులు కనిపిస్తాయి. మరి ఆ పాప ఆత్మ ఎందుకు అవుతుంది.. ఆమె తల్లిదండ్రులు ఎవరు.. వారికి ఏమౌతుంది.. చివరికి సూరిలో మార్పు కనిపిస్తుందా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఫహాద్ ఫాజిల్ ఉన్నాడు కాబట్టి కథలో కొత్తదనం ఉంటుంది అని చాలామంది భావించారు. బట్ ఈ కథలో అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు. ఇంకా చెబితే చాలా బోరింగ్ గా కూడా ఉంది. చాలా సీన్స్ ఇరికించినట్టుగా ఉన్నాయి. అసలు పాయింట్ చెప్పడానికి రెండున్నర గంటల పాటు ఇబ్బంది పెట్టాడు. సూరి ఓ స్వార్థపరుడు. అతని వరకు మాత్రమే ఆలోచించుకుంటాడు. పక్కవాడి గురించి అస్సలు పట్టించుకోడు. ఇంత వరకు బానే ఉంది. కానీ మిగతా పాత్రల్లో బలం లేకపోవడం మైనస్ గా కనిపించింది. ఇంకా చెబితే ఆ పాప అంత జోవియల్ గా ఎందుకు ఉంది.. ఆమె ఆత్మ అని తెలియడానికి సూరికి అంత టైమ్ ఎందుకు పడుతుంది.. అసలు ఆ పాప తన పేరెంట్స్ గురించి ఎందుకు పట్టించుకోలేదు అంటూ అనేక సందేహాలు కనిపిస్తాయి.
ప్రీ క్లైమాక్స్ నుంచి కాస్త ఎమోషనల్ గా సాగుతుంది మూవీ అనిపిస్తుంది. బట్ అప్పటికే నష్టం జరిగిపోయింది. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ లో ఫహాద్ ఫాజిల్, సారా మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. అక్కడక్కడా ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి. చివరి సీన్ చూస్తే.. సిల్లీగా ఉంది. అంత పెద్ద లోయలో కార్ పడినా.. కేవలం పాప మాత్రమే చనిపోవడం.. మిగతా ఇద్దరు బతికి పోవడం వరస్ట్ రైటింగ్ లా ఉంది. ఓవరాల్ గా చూస్తే డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ ఏమంత ఆకట్టుకోలేకపోయిన కథ, కథనం. వెరీ యావరేజ్ మూవీలాగా కనిపిస్తోంది.
నటన పరంగా :
ఫహాద్ ఫాజిల్ నటన బావున్నా.. డబ్బింగ్ అస్సలు బాలేదు. ప్రతి డైలాగ్ పట్టి పట్టి చెప్పినట్టుగా ఉంది. వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తే బావుండేది అనిపిస్తుంది. సారా పాలేకర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. చాలా సీన్స్ లో తన నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇతర పాత్రల్లో మహేష్ కాకుమాను పాత్ర బావుంది. నటనా బావుంది. మహేష్ మంజ్రేకర్ విలనీ ఇరిటేటింగ్ గా ఉంది. సౌరభ్ పాత్రలో కొత్తదనం ఏం లేదు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. ఇతర కాస్టింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే.
టెక్నికల్ గా :
కాల భైరవ సంగీతం బావుంది. నేపథ్య సంగీతంతో బాగా మెప్పించాడు. బట్ కథలో పస లేనప్పుడు అతను ఎంత ఎఫర్ట్ పెట్టినా ఉపయోగం లేదు కదా. సినిమాటోగ్రఫీ బావుంది. విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు శశాంక్ ఎంచుకున్న పాయింట్ బావుంది. దాన్ని కథగా మలచడంలో మాత్రం విఫలం అయ్యాడు. కథనంతో అయినా మెప్పించాడా అంతే అదీ లేదు. సిల్లీ పాయింట్ చుట్టూ అల్లుకున్న సోషియో ఫాంటసీ మిక్స్ అయిన బోరింగ్ మూవీ అని చెప్పొచ్చు.
ఫైనల్ గా : చూస్తేనే ట్రబుల్
రేటింగ్ : 2/5
KYR
